ఏపీ ఉద్యోగులకు లోకేష్ కీలక హామీలు ! ఈసారి అధికారమిస్తే మళ్లీ ఆ జాక్ పాట్ ?
ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్ని ప్రయోజనాలు కల్పించినా, కల్పించకపోయినా ఉద్యోగుల్లో మాత్రం అసంతృప్తి కనిపిస్తూనే ఉంటుంది. ఇదే క్రమంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చి వారి ఓట్లు గంపగుత్తగా వేయించుకుని అధికారంలోకి వచ్చింది. అయితే వచ్చీ రాగానే 27 శాతం ఫిట్ మెంట్ అమలు చేసింది. ఆ తర్వాత 11వ పీఆర్సీని కూడా అమలు చేసింది. అయితే ఇందులో పెంచిన వేతనాలపై ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా డీఏలతో కలిపి పీఆర్సీ ప్రయోజనం చూపించడం, ఆ తర్వాత డీఏలు కూడా ఇవ్వకపోవడంతో ఇది మరింత పెరిగింది.
ఇప్పుడు దీన్ని సొమ్ము చేసుకునేందుకు విపక్ష టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఉద్యోగుల్ని తిరిగి తమవైపు తిప్పుకునేందుకు ఓ కీలక హామీ ఇస్తోంది. ఇది గతంలో తాము రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసి చూపించిన హామీ కూడా కావడంతో ఉద్యోగులు దీన్ని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. తాజాగా టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన ఈ హామీపై ఇప్పుడు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అసలే వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతన్న వేళ లోకేష్ ఇచ్చిన ఆ హామీ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

ఇంతకీ నారా లోకేష్ ఇచ్చిన ఆ హామీ ఏంటో తెలుసా ? ఉద్యోగులకు అత్యుత్తమ ఫిట్ మెంట్. టీడీపీ ఈసారి అధికారంలోకి వస్తే వారికి అద్భుతమైన ఫిట్ మెంట్ ప్రయోజనం అందిస్తామని లోకేష్ నిన్న ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీంతో ఈ ఫిట్ మెంట్ హామీపై ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు టీడీపీకి అధికారం కట్టబెడితే ఫిట్ మెంట్ ప్రయోజనం ఎంత వరకూ ఉండొచ్చని ఆరా తీస్తున్నారు.
మరోవైపు ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న మరో సమస్య ఒకటో తేదీన వేతనాలు అందకపోవడం. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ఒకటో తేదీ వేతనాలు వస్తాయనే భావన అందరిలో ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా ఒకటో తేదీ వేతనాలు రావడం లేదు. దీంతో ఇప్పుడు లోకేష్ ఈ సమస్యపైనా స్పందించారు. టీడీపీ అధికారంలోకి రాగానే తిరిగి ఒకటో తేదీనే వేతనాలు జమ చేసేలా చూస్తామన్నారు. దీంతో లోకేష్ హామీలపై ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications