జగన్ కు సవాల్!! నారా లోకేష్ కీలక నిర్ణయం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ అనంతరం పరిణామాలపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీలోని ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బాబు అరెస్ట్ ను ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాల నాయకులకు, పార్టీల నేతలకు లోకేష్ ధన్యవాదాలు తెలియజేశారు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయిందని నేతలంతా అభిప్రాయపడ్డారు.
యాత్ర పున: ప్రారంభం:ఈ సమావేశంలోనే యువగళం పాదయాత్రను పున:ప్రారంభించే విషయమై పార్టీ నాయకులతో లోకేష్ మాట్లాడారు. వచ్చేవారం నుంచి యువగళం ప్రారంభించాలని భావిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ దగ్గర యాత్ర నిలిచిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ చంద్రబాబు కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో:న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతూ కోర్టుద్వారా న్యాయం కోసం పోరాటం చేస్తూనే యువగళం ద్వారా తిరిగి రోడ్డెక్కాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్, వైఎస్ జగన్ కక్షసాధింపు చర్యల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి నాయకులంతా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయనున్నారు. అంతేకాకుండా యువగళం పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ చేస్తున్న కక్ష సాధింపు పనులను కూడా ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. యాత్రను తిరిగి ప్రారంభించడంద్వారా ముఖ్యమంత్రికి టీడీపీ సవాల్ విసిరినట్లవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పొలిటికల్ యాక్షన్ కమిటీ:తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి ఆదేశాల మేరకు పార్టీలో కార్యక్రమాల నిర్వహణ కోసం పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమిస్తూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, ఎంఏ షరీఫ్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్ బాబు, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధన్ రెడ్డి, వంగలపూడి అనిత, బీద రవిచంద్ర యాదవ్ నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications