Nara Lokesh : విజయవాడలో లోకేష్ పాదయాత్ర-ప్రకాశం బ్యారేజ్ పై పోటెత్తిన జనం..
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో చేస్తున్న రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ఇవాళ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోకి ప్రవేశించింది. మంగళగిరి నియోజకవర్గంలో ఇవాళ యాత్ర పూర్తి చేసుకున్న నారా లోకేష్.. ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశించారు. అనంతరం నగరంలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో యాత్ర కొనసాగిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర నగరంలోకి ప్రవేశించగానే ప్రకాశం బ్యారేజ్ పై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు.
నారా లోకేష్ విజయవాడ నగరంలోకి ప్రవేశించగానే అప్పటికే కృష్ణానదిలో ఏర్పాటు చేసిన పడవల్లో టీడీపీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత వన్ టౌన్ వినాయక గుడి దగ్గర ఆర్యవైశ్యులు లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జనాభా దామాషా తమకు నిధులు కేటాయించాలని వారు కోరారు. నామినేటెడ్ పదవుల్లో దామాషా ప్రకారం అవకాశాలివ్వాలన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును ఆర్యవైశ్యులకు కేటాయించాలని కోరారు.

దీనికి స్పందించిన లోకేష్.. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులు స్వేచ్చగా వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. అనవసరమైన పన్నుల భారాన్ని తగ్గించి వ్యాపారాలను ప్రోత్సహిస్తామన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, చిరువ్యాపారులకు సబ్సిడీరుణాలు అందజేస్తామన్నారు. ఆర్యవైశ్యులకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం విజయవాడ కాళేశ్వరరరావు మార్కెట్ క్లాత్ ముఠావర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 40ఏళ్లుగా విజయవాడ వస్త్రలత సముదాయంలో ముఠా కార్మికులుగా ఉన్నామని, గత నాలుగేళ్లలో తమ పరిస్థితులు దుర్భరంగా మారాయని తెలిపారు.దీంతో అధికారంలోకి రాగానే వారిని అదుకుంటామన్నారు.

ఆ తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్వర్ణప్యాలెస్ వద్ద ఆటోవర్కర్స్ యూనియన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. దీంతో ఆటోడ్రైవర్ల కష్టాల పరిష్కారానికి లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం బీసెంట్ రోడ్డులో విజయవాడ బుక్ పబ్లిషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ప్రభుత్వ పుస్తకాలకు బిల్లులు రావడం లేదని ఫిర్యాదు చేశారు. నాలుగేళ్లు పూర్తైనా బిల్లులు విడుదల చేయడం లేదన్నారు. దీంతో టిడిపి అధికారంలోకి వచ్చాక పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications