'అమెరికా తెలివైన వాళ్లని కోల్పోతుంది, బలవంతంగా పంపినా.. మనకు ప్లాన్'
అమెరికా హెచ్1బీ వీసాల అంశంపై నాస్కామమ్ మాజీ చీఫ్ మోహన్ రెడ్డి స్పందించారు. అమెరికాలోని ఇండియన్స్‌ను వెనక్కి పంపించడం వల్ల ఆ దేశం ఆర్థికంగా నష్టపోతుందని, అలాగే తెలివైన వారిని కోల్పోయే ప్రమాదముందన్నారు.
విజయవాడ: అమెరికా హెచ్1బీ వీసాల అంశంపై నాస్కామమ్ మాజీ చీఫ్ మోహన్ రెడ్డి స్పందించారు. అమెరికాలోని ఇండియన్స్‌ను వెనక్కి పంపించడం వల్ల ఆ దేశం ఆర్థికంగా నష్టపోతుందని, అలాగే తెలివైన వారిని కోల్పోయే ప్రమాదముందని చెబుతున్నారు. అమెరికాలో మనవాళ్లు అక్రమంగా ఉండటం లేదన్నారు.
హెచ్1బి వీసాల విషయంలో తొందరపాటు చర్యలు సరికాదని ఇప్పటికే అమెరికా దేశానికి చెందిన సెనెటర్ల వద్ద ప్రధాని మోడీ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారని, ఒకవేళ బలవంతంగా మన వాళ్లను స్వదేశానికి పంపినా వారి సేవలను మెరుగైన రీతిలో వినియోగించుకునేందుకు భారత ప్రభుత్వం తగిన ప్రణాళిక రూపొందిస్తోందన్నారు.
ట్రంప్ ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఏవీ ఇవ్వలేదని, మొత్తం వ్యవహారం చర్చల్లో ఉందని మోహన్ రెడ్డి చెప్పారు. మూడు లక్షల మంది అక్రమంగా అమెరికాలో ఉన్నారనడం సరికాదని, దీని గురించి భారతీయులు అంతగా కంగారు పడాల్సింది లేదన్నారు.

కేంద్రం పరిణామాలను పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోడీ అమెరికాకు చెందిన 24 మంది సెనెటర్లతో భేటీ అయ్యారని, ఇందులో హెచ్1బి వీసా విషయంపై ప్రధానంగా చర్చ జరిగిందన్నారు.
అక్కడున్న మనవాళ్లంతా దేశానికి పన్ను రూపంలో భారీ మొత్తాలు చెల్లించిన విషయాన్ని పరిగణనలో ఉంచుకోవాలని ప్రధాని మోడీ పేర్కొన్నారని ఆయన తెలిపారు. ఒకవేళ ఆ దేశం నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో నిపుణులు బయటకు పంపించినా మన వద్ద ప్రత్యామ్నాయ ప్లాన్ ఉందన్నారు.
కాగా, ట్రంప్ తమ దేశం నుంచి నమోదు కాని వలసదారులను తిప్పి పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. దీని ప్రభావం మూడు లక్షల మంది భారతీయులపై పడబోతుందంటున్నారు.
అక్రమ వలసదారులు నేరగాళ్ల తరహాలోనే దేశానికి ముప్పు అనీ, తిప్పి పంపే వారి జాబితాలో ఇలాంటి వారికి ప్రాధాన్యం ఉంటుందని అమెరికా ప్రకటిస్తోంది. ఇది భారతీయులను కలవరపెడుతోంది.












Click it and Unblock the Notifications