రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
ఏపీ ప్రజలకు శుభవార్త. చిత్తూరు జిల్లాలోని పూడి- ఏర్పేడు రైల్వేస్టేషన్ల మధ్య నూతన రైలు మార్గం అందుబాటులోకి రాబోతోంది. దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతంలోని ప్రధాన నగరాల మధ్య తక్కువ సమయంలో సరకు రవాణా చేయడానికి ఈ మార్గం ఉపయోగపడనుంది. ప్రస్తుతం నడుస్తున్న గూడ్స్ రైళ్లు పూడి నుంచి రేణిగుంట చేరుకొని అక్కడి నుంచి విజయవాడ, ముంబయివైపు ప్రయాణిస్తున్నాయి. దీనికి సంబంధించిన అన్ని పనులను భారతీయ రైల్వే సిద్ధం చేస్తోంది.
సరకు రవాణా చేసేందుకు ఎక్కువ సమయం పడుతోందని, రేణిగుంట రైల్వే జంక్షన్ లో ప్రధాన ఆలస్యం జరుగుతోందని అధికారులు గుర్తించారు. ఈమేరకు రైల్వేబోర్డు నివేదిక తయారుచేసింది. పూడి నుంచి ఏర్పేడు వరకు 27 కిలోమీటర్ల దూరం సర్వే చేసి ప్రాథమిక నివేదికను రూపొందించారు. గూడ్స్ రైళ్లతోపాటు సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా నడవనున్నాయి.

ఈ మార్గంలో కొత్తగా మరో రైల్వేస్టేషన్ కూడా రానుంది. రేణిగుంటలో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించగలిగితే ప్రయాణ సమయం కలిసివస్తుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే రేణిగుంటపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. రైతులు పండించే వస్తువులు కూడా దూర ప్రాంతాలకు రవాణా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో భారీ పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులు కూడా రవాణా చేయడానికి వీలుంటుందని అధికారులు నిర్ణయించారు.
సరకు రవాణాద్వారా రైల్వేకు ఆదాయం అధికంగా వస్తుండటంతో భారతీయ రైల్వే దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందుకనుగుణంగా కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయడంతోపాటు డబుల్ లైన్ల ఏర్పాటుద్వారా సరకు రవాణాను వేగవంతం చేస్తోంది. గూడ్స్ రైళ్లు నడిచే వేగాన్ని కూడా పెంచారు. గతంలో సరకు రవాణా అత్యంత నెమ్మదిగా జరిగేది. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక ఆదాయాన్ని ఆర్జించాలంటే గూడ్స్ రైళ్లను వేగంగా నడపడం ఒక్కటే మార్గమని అధికారులు భావిస్తున్నారు. రైల్వేకు ప్రయాణికుల రైళ్లకన్నా గూడ్స్ రైళ్లద్వారానే అధిక ఆదాయం వస్తోంది. వచ్చే ఆదాయంలో సింహభాగం సరకు రవాణా నుంచే వస్తోంది.












Click it and Unblock the Notifications