యుపిఎపై అవిశ్వాసం: వెనకబడిపోకూడదనే జగన్?
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఆరుగురు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు నలుగురు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ స్థితిలో ఆయన విడిగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. పార్లమెంటులో విభజన బిల్లును ఓడించడానికి ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ జాతీయ పార్టీల నాయకుల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
విభజనపై యుపిఎ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. అయితే, సమైక్యాంధ్ర కోసం జగన్ వారికి మద్దతు తెలపకుండా విడిగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వైయస్సార్ కాంగ్రెసుకు లోకసభలో జగన్‌తో పాటు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉన్నారు. ఎస్పీవై రెడ్డి కూడా ఆయన వెంటే ఉన్నారు. దీంతో ఈ ముగ్గురి సంతకాల్లో అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు.

సమైక్యవాదానికి నాయకత్వం వహించడానికి మాత్రమే ఇష్టపడే జగన్ వారు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు దూరంగా ఉంటూ విడిగా నోటీసు ఇవ్వడం వెనక తాను వెనకబడిపోకూడదనే ఉద్దేశం ఉన్నట్లు చెబుతున్నారు. పైగా, తమకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మద్దతు ఉందని అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకం చేసిన సబ్బం హరి అన్నారు. అందువల్ల కూడా జగన్ విడిగానే వ్యవహారానికి సిద్ధపడ్డారు.
తెలుగుదేశం పార్టీ లోకసభ సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు ఆయన మరింతగా దూరంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. అవిశ్వాస తీర్మానానికి జగన్ ఏ విధంగా మద్దతు కూడగడుతారనేది చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications