ఎవరి వల్ల కాదు: చిరు, జగన్‌పై సోనియా తీవ్ర ఆగ్రహం
గుంటూరు: కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఎవరి వల్ల కాదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి శుక్రవారం అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సభలో చిరు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లడిగే హక్కు తమకే ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు మంచే జరిగిందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ రైతులు, మహిళలు, పేదల గుండెల్లో ఉందన్నారు. భారతీయులమని చెప్పుకునేలా దేశాన్ని తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. కాంగ్రెసు సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజలకు భరోసా అన్నారు. దేశానికి వెన్నెముక రైతు అయితే, ఆ రైతుకు కాంగ్రెస్ వెన్నెముక అన్నారు. కాంగ్రెసు అనేది రైతుల గుండెల్లో ఉందన్నారు.

జగన్ చెప్పగలరా: రఘువీరా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి మద్దతివ్వనని చెప్పగలరా అని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. టిడిపి, బిజెపి పొత్తు సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలు నమ్మటం లేదన్నారు. అధికార దాహంతో వారు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. రైతులకు రెండు లక్షళ రూపాయల వరకు రుణమాఫీ ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని చెప్పారు.
జగన్ పైన సోనియా ఆగ్రహం
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ... గుంటూరు సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందే వరకు కాంగ్రెసు వ్యక్తిగా ఉన్నారన్నారు.
ఆయనకు కాంగ్రెసు పార్టీతోనే గుర్తింపు వచ్చిందన్నారు. వైయస్‌కు కాంగ్రెసు పార్టీ అనేక పదవులు చాలా ప్రోత్సహించిందని చెప్పారు. ఆయన కాంగ్రెసు వ్యక్తిగానే మృతి చెందారన్నారు. కానీ, జగన్ మాత్రం చెట్టుకాయలు చెప్పి కాయలు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీ ముఖ్యమన్నారు. తమ పార్టీ పైన జగన్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. 2009లో వైయస్ తెలంగాణ ఇవ్వమన్నారన్నారు.












Click it and Unblock the Notifications