అక్కడ వారం రోజులు చికెన్, మటన్, ఫిష్ షాపులు బంద్.. విక్రయిస్తే చర్యలే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు మాంసం విక్రయాలపైన నిషేధం విధించారు. చికెన్, మటన్ మాత్రమే కాదు చేపలు, రొయ్యలు ఇలా ఏదీ విక్రయించకూడదని కీలక ఆదేశాలు ఇచ్చారు. దీంతో నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగిలినట్టు అయింది. అసలు ఇంతకీ అక్కడ ఎందుకు ఇంత కఠినమైన నిషేధాన్ని విధించారు అంటే
నాన్‌వెజ్ ఉత్పత్తుల విక్రయాలపై తాత్కాలిక నిషేధం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీ పరిధిలోని చందాపురంలో ప్రజలు డయేరియాతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ డయేరియా విజృంభించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజారోగ్యం దృష్ట్యా, మార్చి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు మాంసం, నాన్‌వెజ్ ఉత్పత్తుల విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు.

చందాపురంలో డయేరియా బారిన పడిన ప్రజలు
నందిగామ పురపాలక పరిధిలోని హోటళ్లు, చికెన్, మటన్, చేపల దుకాణాలు, కర్రీ పాయింట్‌లు సహా నాన్‌వెజ్ వంటకాల అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం చందాపురంలో డయేరియా బారిన పడిన ప్రజలు జ్వరాలు, విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరారు. కొందరికి ఇళ్ల వద్దే చికిత్సలు అందుతున్నాయి.
డయేరియా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు
డీఎంహెచ్‌వో సుహాసిని గ్రామాన్ని సందర్శించి, వ్యాప్తి కారణాలపై ఆరా తీసి, అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, డయేరియా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీళ్లను తాగాలని సూచనలు చేస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. నిల్వచేసిన ఆహారాన్ని మానుకొని, ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినాలని సూచిస్తున్నారు.
డయేరియా నివారణకు సూచనలు
డయేరియా నివారణకు ప్రజలు పలు సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓఆర్ఎస్ తో పాటు క్లోరినేటెడ్ నీటి వాడకం పైన కూడా అవగాహన కల్పిస్తున్నారు. కొత్త కేసులు నమోదు కానప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వారు చెబుతున్నారు.
నందిగామ ఆసుపత్రులలో 17 మంది బాధితులకు చికిత్స
ఇదిలా ఉంటే డయేరియా కారణంగా నందిగామ ఆసుపత్రులలో 17 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఓ వృద్ధురాలిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డయేరియా బాధిత గ్రామంలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఇంటింటినీ సర్వే చేశారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీ బృందం గ్రామంలో పర్యటించింది. వైద్య, పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications