Jagan and Sharmila: నవంబర్ 29. ఇద్దరి రాజకీయ జీవితం మలుపు తిప్పిన రోజు..!!
నవంబర్ 29. ఈ రోజు వైఎస్ జగన్- వైఎస్ షర్మిల ఇద్దరి రాజకీయజీవితంతో ప్రత్యేక అనుబంధం ఉన్న రోజు. రాజకీయంగా మలుపు తిప్పిన రోజు. 2009లో వైఎస్సార్ మరణం తరువాత ఏడాదికి పైగా కాంగ్రెస్ లో కడప ఎంపీగా పని చేసిన వైఎస్ జగన్ సరిగ్గా ఇదే రోజు 2010, నవంబర్ 29న కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఎంపీ పదవికి రాజీనామా చేసారు. ఆ వెంటనే సొంత పార్టీ ఏర్పాటు చేసి తొలి ఎన్నికల్లోనే జాతీయ స్థాయిలో రికార్డు మెజార్టీ సాధించారు. తల్లి విజయమ్మ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాడు అన్న వదిలిన బాణంగా జగన్ కోసం శ్రమించిన వైఎస్ షర్మిల నేడు తెలంగాణలో సరిగ్గా ఇదే తేదీ నాడు సంచనలంగా మారారు. కేసీఆర్ ప్రభుత్వం పైన ఈ తరహా పోరాటం చేసిన మహిళగా నిలిచారు. నాడు అన్న కాంగ్రెస్ ను వదిలి సంచలననాకి కారణమైతే..నేడు షర్మిల తెలంగాణలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

జగన్ ను సీఎం చేయటానికి తొలి అడుగు ఇదే రోజున...
2009 సెప్టెంబర్ 2. వైఎస్సార్ మరణం తరువాత ఆయన కుటుంబంలోనూ...ఏపీ రాజకీయాల్లోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకున్న రోజులు. తన తండ్రి మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాల ఓదార్పుకు నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా అనుమతి కోసం తల్లి విజయమ్మ..సోదరి షర్మిలతో జగన్ వెళ్లారు. కానీ, అక్కడ ఎదురైన అవమానంతో సరిగ్గా ఇదే రోజున 2010లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. పలువురితో చర్చలు చేసి చివరకు 2011 మార్చి 11ప తన తండ్రి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసారు. తల్లి విజయమ్మతో కలిసి కాంగ్రెస్ వీడిన జగన్.. తిరిగి 2011 మే లో జరిగిన ఉప ఎన్నికల్లో జాతీయ స్థాయిలో అత్యంత భారీ మెజార్టీ ఏకంగా 5, 43,053 ఓట్ల తో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో పోలైన ఓట్లలో టీడీపీ-కాంగ్రెస్ కు కలిపి వచ్చిన ఓట్లు 7,433 మాత్రమే. అదే విధంగా తల్లి విజయమ్మ పులి వెందుల నుంచి మరిది వైఎస్ వివేకా మీద 85,191 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జగన్ ను ఓడించేందుకు నాటి సీఎం కిరణ్ ఏకంగా 15 మంది మంత్రులను కడపలో మొహరించారు. కానీ, గెలుపు ఆపలేకపోయారు.

అక్కడ మొదలై 2019లో సీఎం అయ్యేదాకా...
2010, నవంబర్ 29న మొదలై జగన్ పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ ఇక ఎక్కడా ఆగలేదు. జగన్ పైన కేసులు..విచారణలు.. జైలు జీవితం.. రాష్ట్ర విభజన..జగన్ కోసం తల్లి విజయమ్మ..చెల్లి షర్మిల రాజకీయ పోరాటం..ఎన్నో అవమానాలు..మరెన్నో పరాభవాలు..కానీ, ప్రజా మద్దతు మాత్రం వైఎస్ కుటుంబం వైపే నిలిచింది. సొంత పార్టీ పెట్టుకున్న జగన్ పైన వేధింపులు పెరిగాయి. జగన్ కు మద్దతుగా నాటి కాంగ్రెస్ - టీడీపీ - పీఆర్పీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మద్దతుగా నిలిచారు. తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసారు. ఫలితంగా 2012లో ఉమ్మడి ఏపీలో నెల్లూరు లోక్ సభతో పాటుగా 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో కొండా సురేఖ చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన పరకాలలో టీఆర్ఎస్ గెలవగా, కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలిచింది. నెల్లూరు లోక్ సభ- 15 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. నాడు అభ్యర్దుల విజయంలో విజయమ్మ - షర్మిల ప్రచారమే కీలకం. ఇక, 2014లో టీడీపీ -బీజేపీ - పవన్ ఉమ్మడిగా పోటీ చేసినా జగన్ ఒంటరిగానే బరిలోకి దిగారు. 67 సీట్లు దక్కించుకొని ప్రతిపక్ష పాత్ర పోషించారు. 2017 ప్రారంభించిన పాదయాత్రతో 2019 ఎన్నికల్లో అనూహ్యంగా 151 అసెంబ్లీ.. 23 లోక్ సభ సీట్లు సాధించి సీఎం అయ్యారు. దీంతో, ఈ రోజు నవంబర్ 29 జగన్ రాజకీయ జీవితంలో కీలకమైన రోజు.

తెలంగాణ రాజకీయం ఇదే రోజున షర్మిల చుట్టూ..
అన్నతో విభేదించి తెలంగాణలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేసారు. నేరుగా సీఎం కేసీఆర్ తో ఢీ కొంటున్నారు. పార్టీ ఏర్పాటు తరువాత ఇప్పటి వరకు షర్మిలకు రాజకీయంగా హైప్ రాలేదు. కానీ, కొద్ది రోజులుగా షర్మిల అధికార పార్టీ లక్ష్యంగా మాటల దాడిని పెంచారు. ఫలితంగా 3500 కిలో మీటర్ల పాదయాత్ర ఇప్పటి వరకు పూర్తి చేసారు. టీఆర్ఎస్ శ్రేణుల నుంచి దాడులు జరిగాయి. షర్మిలకు గాయమైందని చెబుతున్నారు. షర్మిలను పాదయాత్ర నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. కానీ, షర్మిల ఆగలేదు. దాడి జరిగిన కారును తానే స్వయంగా నడుపుకుంటూ కేసీఆర్ ఉండే ప్రగతి భవన్ కు బయల్దేరారు. మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. కారు డోర్లు కూడా తీయలేదు. తప్పని పరిస్థితుల్లో పోలీసులు షర్మిలను కారులోనే ఉంచి ట్రాఫిక్ వాహనం ద్వారా ఆ కారును పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. తల్లి విజయమ్మ తన కుమార్తెను చూసేందుకు బయల్దేరగా హౌస్ అరెస్ట్ చేసారు. ఆ తరువాత షర్మిల అరెస్ట్ ను పోలీసులు అధికారికంగా ప్రకటించారు. బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ అన్నట్లుగా మారిన తెలంగాణ రాజకీయాల్లో ఈ రోజంతా సంచలనంగా మారారు. ఇదే రోజు నవంబర్ 29 ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు.