తెలంగాణ స్పందన బాగు, బాబుకు నాలుగు రోజుల టైమే: జగన్
అనంతపురం: మున్సిపల్ కార్మికుల సమ్మెపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నాలుగు రోజుల సమయం ఇస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని ఆయన చెప్పారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్ గురువారంనాడు మున్సిపల్ కార్మికుల సమ్మెపై స్పందించారు.
గత 14 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనిపించడం లేదా అని ఆయన అడిగారు. చంద్రబాబు ప్రభుత్వానికి నాలుగు రోజుల సమయం మాత్రమే ఇస్తున్నామని, ఈలోగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర బంద్ చేపడుతామని ఆయన హెచ్చరించారు.

శుక్రవారంనాడు తలపెట్టిన మున్సిపల్ కార్మికుల కలెక్టరేట్ల ముట్టడికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికుడు వెంకయ్య గుండెపోటుతో మరణించాడని ఆయన ఆరోపించారు. జీతాలు పెంచాలని అడిగితే ఉక్కుపాదంతో అణచేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన దుయ్యబట్టారు.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పడం న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. కార్మికుల వేతనాలు పెంచితే రూ. 200 కోట్ల నుంచి 300 కోట్ల భారం పడుతుందని ఆయన చెప్పారు. కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నానరి ఆయన అన్నారు.
సింగపూర్ బృందానికి ఎర్ర తివాచీ పరిచే చంద్రబాబుకు కార్మికుల సమస్యలు పట్టవా అని అడిగారు. మున్సిపల్ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ప్రతిస్పందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications