పెళ్లైన నెలకే అల్లుడి కళ్లలో కారం కొట్టి, కుమార్తె కిడ్నాప్
Recommended Video

తిరుపతి: వారిద్దరికి మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అయితే, కులాలు వేరు కావడంతో అమ్మాయి తరపు పెద్దలు వారి పెళ్లిని అంగీకరించలేదు. పెళ్లైన నెలరోజులకే అల్లుడిపై దాడి చేసి, కళ్లలో కారం కొట్టి తమ కూతురు తీసుకెళ్లారు అమ్మాయి తరపువారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడలో సోమవారం చోటుచేసుకుంది.

పెళ్లికి దారితీసిన ప్రేమ..
ఆ వివరాల్లోకి వెళితే.. తిరుపతికి చెందిన నవీన్ కుమార్ చంద్రగిరి గ్రామీణ ప్రభుత్వ ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌గా పని చేస్తున్న సమయంలో మెడిసన్ చదువుతున్న సిరిచందనతో ఫేస్‌బుక్ ద్వారా అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమ వివాహానికి దారి తీసింది.

కళ్లలో కారం కొట్టి సిరిచందనను తీసుకెళ్లారు..
కాగా, కుమార్తె వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సిరిచందన తల్లిదండ్రులు సోమవారం మధ్యాహ్నం రెండు ఇన్నోవా వాహనాలతో వచ్చి... భార్యాభర్తలు ఇంటికి వెళుతుండగా నవీన్‌పై దాడి చేశారు. నవీన్ కళ్లలో కారం కొట్టి అనంతరం సిరిచందనను బలవంతంగా తీసుకు వెళ్లారు. నవీన్‌కుమార్ తన సోదరి సాయంతో చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పోలీసులకు ఫిర్యాదు..
తాను ఎస్టీ కులానికి చెందిన వాడిని కావడంతో సిరిచందన తల్లిదండ్రులు రాజభూపాల్ రెడ్డి, పార్వతి... తనపై దాడి చేసి తన భార్యను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చంపుతామంటున్నారు..
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. సిరిచందన, తాను ఆగస్టు 16న పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. అయితే, తమ పెళ్లి సిరిచందన తల్లిదండ్రులకు ఇష్టం లేదని, అందుకే తనపై దాడి చేసి భార్యను బలవంతంగా తీసుకెళ్లారని తెలిపాడు. తన కళ్లలో కారం కొట్టి, పది మంది తనపై కర్రలతో దాడి చేశారని చెప్పాడు. ఈ దాడి సిరిచందన తండ్రే చేశాడని తెలిపాడు. తమను చంపుతామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని చెప్పాడు.












Click it and Unblock the Notifications