రాప్తాడుకు పట్టిన శని ప్రకాష్ రెడ్డి.. జాకీ పరిశ్రమ నుంచి రూ . 15 కోట్లు డిమాండ్ : పరిటాల సునీత
ఏపీలో రాక్షస పాలన నడుస్తోందని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. వైసీపీ నేతల ఆగడాలకు టీడీపీ పాలనలో వచ్చిన కంపెనీలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయడం చేతకాని వైసీపీ ఎమ్మెల్యేలు.. పరిశ్రమనులను బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. రాప్తాడుకు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి శనిలా గ్రహణం పట్టారని విమర్శించారు. నియోజకవర్గం నుంచి జాకీ పరిశ్రమ తరలిపోవడానికి ఆయనే కారణమని ఆరోపించారు.

పరిటాల సునీత పాదయాత్ర
గత టీడీపీ ప్రభుత్వం రాప్తాడు నియోజకవర్గంలో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు తీసుకుచ్చి .. దాని ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో పాటు ఇతర వైసీపీ ప్రభుత్వ పెద్దల నుంచి జాకీ పరిశ్రమకు బెదిరింపులు వచ్చినట్లు పరిటాల సునీత ఆరోపించారు.
వైసీపీ నేతల దౌర్జన్యాలతో పరిశ్రమ తమిళనాడుకు తరలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని కారణం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డియే అని మండిపడ్డారు. జాకీ పరిశ్రమ వెళ్లిపోవడాన్ని నిరసిస్తూ స్థానిక నిరుద్యోగులతో కలిసి రాప్తాడు తహసిల్దార్ కార్యాలయం వరకు పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జీ పరిటాల శ్రీరామ్ పాదయాత్ర నిర్వహించారు.

పరిశ్రమ నుంచి రూ. 15కోట్లు డిమాండ్
యువతకు ఉపాధి కల్పించడం చేతకాని వైసీపీ నేతలు.. ఉన్న పరిశ్రమలను వెల్లగొడుతున్నారని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతే యువత పరిస్థితేంటని ప్రశ్నించారు. జాకీ పరిశ్రమ యాజమాన్ని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి రూ. 15 కోట్లు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. మీకు చేతనైతే మరలా ఆపరిశ్రమను తిరిగి తీసుకురావాలని ప్రకాష్ రెడ్డికి సునీత సవాల్ విసిరారు. జగన్ ఆరాచక పాలనతో సామాన్యులు గగ్గొలు పెడుతున్నారని దుయ్యబట్టారు. రోజుకో రకం పన్నులు వేస్తూ జనం నడ్డి వీరుస్తున్నారని దుయ్యబట్టారు.

యువతకు నిరాశ
జాకీ పరిశ్రమ ఏర్పాటైతే ఈప్రాంతంలో సుమారు 6వేల మంది యువతకు ఉపాది దొరికేదని పరిటాల శ్రీరామ్ అన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి ఉన్న కపెంనీని వెళ్లకొట్టినందుకు ప్రజలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2017లో ఈ జాకీ పరిశ్రమను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. రాప్తాడుకు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నారని వారి ఆస్తులు లాక్కొంటున్నారని ఆరోపించారు. రాప్తాడుకు ప్రకాష్ రెడ్డి అనే గ్రహణం పట్టి వేదిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పట్టిన శని వీడాలంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఉందని శ్రీరామ్ స్పష్టం చేశారు. వైసీపీ దుర్మార్గాలపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications