పట్టిసీమకు ఆదిలోనే ఎదురుదెబ్బ: అక్విడక్ట్‌కు గండి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదలకు పంపు సెట్లను ఆన్ చేసిన కొద్ది గంటల లోపలే అక్విడక్ట్‌కు గండి పడింది. పెదవేగీ మడలం జనంపేట గ్రామం వద్ద శనివారం రాత్రి అక్విడక్ట్‌కు గండి పడింది.
అక్విడక్ట్‌కు 20 అడుగుల గండి పడింది. దీంతో ఈ కాలువకు తమ్మిలేరు కాలువ ద్వారా నీరందించే మొదటి పంపును అధికారులు ఆపేశారు. మట్టితో కప్పిన కట్టకు గండి పడిందని అధికారులు చెబుతున్నారు. దాంతో కొత్తూరు కాజ్‌వేజ్‌పై నీరు ప్రవహించడంతో దాదాపు 26 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.
భారీ నీటి పారదుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారంనాడు ఆ మోటారును ఆన్ చేసి నీరు విడుదల చేశారు. నిజానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 16వ తేదీన ఆ ప్రాజెక్టును ప్రారంభించాలని అనుకున్నారు. అయితే, సాంకేతిక సమస్యల వల్ల పూర్తి కాకపోవడంతో చంద్రబాబు పూజతో సరిపెట్టారు.

ఆ తర్వాత నీటిని విడుదల చేసిన తర్వాత అక్కడి నుంచి తిరిగి రావాలని చంద్రబాబు నాయుడు దేవినేని ఉమను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిడితో అధికారులు, కాంట్రాక్టర్లు పనులను హడావిడిగా ముగించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 18వ తేదీన నీటిని విడుదల చేశారు.
గండిని పూడ్చడానికి అధికారులు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. అయితే, అది సాధ్యం కాకపోవడంతో మోటారాను ఆపేశారు. ఉధృతమైన నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిన ప్రజలను తరలించడానికి అధికారులు పడవలను వాడుతున్నారు. దానికితోడు ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాల కారణంగా వాగులూ వంకలు పొంగిపొర్లుతున్నాయి.












Click it and Unblock the Notifications