పవన్ సెల్ఫ్ గోల్ - జగన్ చేతికి బ్రహ్మాస్త్రం, బీజేపీ అలర్ట్..!!
ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. కూటమిలోని మూడు పార్టీలు జగన్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో పవన్ కారణంగా కూటమి అధికారంలోకి వచ్చిందని ప్రధాని సహా ముఖ్య నేతలు ప్రశంసించారు. డిప్యూటీ సీఎం అయిన తరువాత పవన్ చొరవ పైనా సానుకూల స్పందన కనిపించింది. అయితే, కొంత కాలంగా పవన్ తీరు లో మార్పు కనిపిస్తోంది. పవన్ చేస్తున్న భిన్న వ్యాఖ్యలు జనసేన శ్రేణులకే అంతు చిక్కటం లేదు. బలం పెంచుకోవాల్సిన సమయంలో పవన్ తీరు జగన్ పార్టీకి అస్త్రంగా మారుతోంది. దీంతో, బీజేపీ అలర్ట్ అయింది. ఏపీలో కొత్త రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
పవన్ ఎందుకిలా
డిప్యూటీ సీఎం పవన్ లో భిన్న వైఖరి కనిపిస్తోంది. 2024 ఎన్నికల సమయంలో ఎన్ని విమర్శలు వచ్చినా 21 సీట్లకే పరిమితం అయిన పవన్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. పవన్ ను ప్రధాని సహా ముఖ్య నేతలు ప్రశంసించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ లో క్రమేణా మార్పు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రస్తావించిన అంశాలు.. ఇచ్చిన హామీల కు అనుగుణంగా పవన్ నడుచుకోవటం లేదనే చర్చ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. పిఠాపురం వేదికగా హోం మంత్రి పైన చేసిన వ్యాఖ్యలు.. సీజ్ ది షిప్ వ్యవహారం పైన కూటమిలోనే భిన్నా భిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇక, పార్టీ ప్లీనరీ వేదికగా పవన్ తానే 43 ఏళ్ల టీడీపీని నిలబెట్టానని చెప్పుకొచ్చారు. ఇది కొందరు టీడీపీ నేతలకు నచ్చలేదు.

పవన్ వ్యాఖ్యలతో
టీడీపీని పవన్ నిలబెడితే.. గతంలో పొత్తులు పెట్టుకున్న ఇతర పార్టీలను పవన్ ఎందుకు నిలబెట్ట లేకపోయారనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ చర్చ ముగియకముందే.. ఇప్పుడు పీ4 కార్యక్రమంలో పవన్ భిన్నమైన వ్యాఖ్యలు చేసారు. తమ దగ్గర సత్తా లేనందునే 2014 నుంచి చంద్రబాబు నాయుడి కి మద్దతు ఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు జనసేన శ్రేణు లు విస్తుపోతున్నాయి. పవన్ తాజా వ్యాఖ్యలు జనసేన భవిష్యత్ కు నష్టం చేస్తాయనే ఆందోళన వారి లో కనిపిస్తోంది. పవన్ ప్రతీ సందర్భంగా మరో 15 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉంటారని చెప్పటం సైతం జనసేన కేడర్ కు రుచించటం లేదు. పవన్ ను సీఎంగా చూడాలనేది తమ కోరిక అయితే, చంద్రబాబు సీఎంగా కొనసాగుతారని పదే పదే పవన్ చెప్పటం ఏంటనే ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సత్తా లేనందునే చంద్రబాబు కు మద్దతు ఇచ్చినట్లు చెప్పటం అంటే ఇంతకు మించిన సెల్ఫ్ గోల్ మరొకటి ఉండదనే అభిప్రాయం జనసేన లోనే వినిపిస్తోంది.
వైసీపీకి అస్త్రంగా
కాగా, పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీకి అస్త్రంగా మారుతున్నాయి. తొలి నుంచి చంద్రబాబు కోసం పవన్ పని చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు కీలక అంశాల పైన పవన్ స్పందించటం లేదు. ఇప్పటికే దీని పైన పవన్ ను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలు రాజకీయంగా కూటమికి.. ముఖ్యంగా జనసేనకు నష్టం చేస్తాయనే వాదన తో బీజేపీ అలర్ట్ అయింది. ఏపీలో కూటమి భాగస్వామిగా కొనసాగుతూ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలో ఢిల్లీ నేతలు ఉన్నారు. తమ భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు పవన్ పైన భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు.. తీరులో వస్తున్న మార్పులు బీజేపీ ముఖ్య నేతలకు అంతు చిక్కటం లేదు. టీడీపీకి మాత్రం పవన్ వ్యాఖ్యలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దీంతో, రానున్న రోజుల్లో పవన్ ఇంకా ఎలాంటి ట్విస్టులు ఇస్తారనే చర్చ.. ఉత్కంఠ కూటమి నేతల్లో మొదలైంది.












Click it and Unblock the Notifications