పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం విషమం..స్పందించని నాడీవ్యవస్థ.. హెల్త్ బులిటెన్ రిలీజ్!
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 54 సంవత్సరాల వయసున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురై వరంగల్లోని రోహిణి ఆస్పత్రిలో చేరారు. అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డికి సిపిఆర్ నిర్వహించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి పంపించారు.
ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం కారణంగా బీపీ డౌన్, హార్ట్ ఎటాక్
ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వరంగల్ లోని రోహిణి ఆస్పత్రిలో చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డికి ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం కారణంగా బీపీ పడిపోయి హార్ట్ ఎటాక్ వచ్చిందనిపేర్కొన్నారు.

మెరుగైన వైద్యం కోసం యశోదాకు పెద్ది
అక్కడ వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సిపిఆర్, ఏ సి ఎల్ ఎస్ పద్ధతులలో అత్యవసర వైద్యం అందించి ఆయన గుండె స్పందన పునరుద్ధరించారన్నారు. అనంతరం అక్కడ త్రాంబోలైసిస్ పూర్తిచేసి, మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు.
పని చేయని పెద్ది సుదర్శన్ రెడ్డి నాడీ వ్యవస్థ
యశోద ఆసుపత్రిలో క్రిటికల్ కేర్, పల్మనాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఆయనకు వైద్య సేవలు అందిస్తోంది. అయితే 45 నిమిషాల పాటు ఆయన గుండె ఆగిపోవడం వల్ల నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈఈజీ, ఎంఆర్‌ఐ , టీసీడీ పరీక్షల్లో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల Anoxic Damage జరిగినట్లు గుర్తించారు.
72 గంటల న్యూరో అసెస్‌మెంట్ తో మెదడు పనితీరు పరిశీలన
శబ్దాలకు, స్పర్శకు ఆయన ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వడం లేదని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన నాడీ వ్యవస్థ పనితీరును మెరుగు పరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ప్రకారం రేపు 72 గంటల న్యూరో అసెస్‌మెంట్ నిర్వహించి మెదడు పనితీరును మరోసారి అంచనా వేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు.
క్రిటికల్ గా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం
ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. ఇక ప్రస్తుతం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ కండిషన్ క్రిటికల్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది.













Click it and Unblock the Notifications