రాత్రి పడుకునే ముందు గుక్కెడు పసుపు కలిపిన గోరువెచ్చని పాలు.. ది బెస్ట్ టానిక్
గృహ వైద్యంలో పసుపు కలిపిన పాలకు ప్రాధాన్యత ఉంది. మన పూర్వీకుల కాలం నుండి జలుబు, దగ్గు, గొంతులో మంట వంటి ఇబ్బందుల నుంచి తక్షణ ఉపశమనం కోసం పసుపు కలిపిన పాలు తాగడం ఒక ఆచారంగా వస్తోంది. పసుపు పాలను రోజులో ఏ సమయంలో తాగినా మంచిదే అయినప్పటికీ.. రాత్రి పడుకునే ముందు తీసుకోవడం ద్వారా అత్యధిక ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి వేళల్లో దీనిని తీసుకోవడం వల్ల రోజంతా ఉండే అలసట తగ్గి శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం ఒక అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. పాలలో ఉండే కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు ఈ పసుపు గుణాలతో కలిసినప్పుడు అదొక టానిక్‌లా మారుతుంది. ముఖ్యంగా చలికాలంలో తలెత్తే కఫం, జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలకు ఓ మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.

రాత్రి నిద్రపోయే ముందు వేడి పసుపు పాలు తాగడం వల్ల మన నాడీ వ్యవస్థ చాలా ప్రశాంతంగా మారుతుంది. ఇది మెదడులోని ఒత్తిడి, ఆందోళన, అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మందిని వేధిస్తున్న అతి పెద్ద సమస్య నిద్రలేమి. పసుపు పాలు తాగడం వల్ల మనస్సుతో పాటు శరీరం కూడా విశ్రాంతి పొంది, నిద్రలేమి సమస్య దూరమవుతుంది. మరుసటి రోజు ఉదయానికి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
చాలా మంది రాత్రి పూట సరైన జీర్ణక్రియ లేక ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల మరుసటి రోజు ఉదయానికి మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తీసుకోవడం వల్ల ప్రేగుల కదలికలు మెరుగై, ఉదయం వేళ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా విరేచనం అవుతుంది. రోజంతా శారీరక శ్రమ చేయడం వల్ల కలిగే తీవ్రమైన కండరాల నొప్పులు, కీళ్ల నొప్పుల నుండి ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. పసుపు కీళ్ల వాపులను కూడా క్రమంగా తగ్గించగలదు.
శరీరంలో హానికరమైన వ్యర్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేసే స్వభావం ఉంటుంది పసుపులో. ఇది శరీరంలో ఉండే మెలానిన్ ఉత్పత్తిని సమర్థవంతంగా క్రమబద్ధీకరించడం ద్వారా ముఖంపై వచ్చే నల్లటి మచ్చలు, మొటిమలు, ఇతర చర్మ అలర్జీలను పూర్తిగా నివారిస్తుంది. చర్మానికి సహజమైన కాంతి, నిగారింపును అందించడంలో పాలు, పసుపుల కలయిక ఎంతో తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ సెప్టిక్ గుణాలు శరీరంలో అంతర్గతంగా ఏర్పడిన పుండ్లు, వాపు, కండరాల గాయాలను చాలా త్వరగా నయం చేయగలదు.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు తాగడం ఓ మంచి అలవాటు మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన జీవన ప్రయాణానికి ఒక చక్కని మార్గం కూడా. ఆరోగ్య, ప్రశాంత జీవితం కోసం దీన్ని జీవనశైలిలో ఓ భాగంగా చేసుకోవడం మేలు.












Click it and Unblock the Notifications