రిజర్వేషన్లపై ఇప్పుడే స్పందించలేనన్న పవన్.. ఇదో సంక్లిష్ట సందర్బం!
అనంతపురం : గుత్తిలోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి సందర్బంగా.. పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలపై ఆసక్తికర సమాధానాలు వెల్లడించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.
రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. కుల రిజర్వేషన్ల వల్ల 'ఓసీ' విద్యార్థులకు నష్టం వాటిల్లుతోందని.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక.. దీనిపై మీ తీరు ఎలా ఉండబోతుంది? అంటూ ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని పవన్ ను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని పలు అంశాలను ప్రస్తావించారు పవన్.
రిజర్వేషన్లను ఒకటి, రెండు తరాలకే పరిమితం చేయాలని, లేకపోతే తర్వాత రోజుల్లో ఇబ్బందులు వస్తాయని అంబేడ్కర్ పేర్కొనట్టుగా తెలిపారు. అయితే ఈ ప్రశ్నపై ఇప్పుడే పూర్తిస్థాయిలో స్పందించలేనని, సున్నితమైన ప్రశ్న కాబట్టి.. దీనిపై ఇప్పుడు మాట్లాడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని పవన్ బదులిచ్చారు. రాబోయే రోజుల్లో దీని గురించి స్పందిస్తానని.. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే.. అసెంబ్లీలోను, ప్రజా దర్బార్ లోను ఈ చర్చను లేవనెత్తుతానని ప్రకటించారు.

నిజానికి రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీ స్థాయిలో చర్చ జరగాలని.. భవిష్యత్తులో ఆ దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానని హామి ఇచ్చారు. రిజర్వేషన్లపై స్పందిస్తూనే.. తనకెలాంటి కుల పట్టింపులు లేవని, కుల రాజకీయాలకు తాను అతీతం అంటూ చెప్పుకొచ్చారు పవన్. కులాలు, మతాలు, ప్రాంతాలను దాటుకుని వెళ్లాలంటే.. ముందు మనల్ని ముందు దాటేసుకుని వెళ్లాలని సూచించారు.
రిజర్వేషన్ల వల్ల నైపుణ్యం ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న మాట వాస్తవమే అన్న పవన్.. అయితే దీనిపై సంతృప్తికర సమాధానం ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం తాను లేదని, ఇదో సంక్షిష్ట సందర్బం అని వివరించారు.












Click it and Unblock the Notifications