Pawan Kalyan : జగన్ ఓడితే పథకాలేం ఆగిపోవు-మరిన్ని ఇస్తామన్న పవన్...
ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలవకపోతే పథకాలు ఆగిపోతాయేమో, సంక్షేమం నిలిచిపోతుందేమో అనుకోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంక్షేమ పథకాల లబ్దిదారులకు భరోసా ఇచ్చారు. ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలు ఉంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదన్నారు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలను అమలు చేస్తామన్నారు.77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వీర మహిళల సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖ పర్యటనలో ఉండగా ఓ 60 ఏళ్ల ఒంటరి మహిళ ఓ కాగితం పట్టుకొని తన దగ్గరకు వచ్చారని, తాను రెల్లి కులానికి చెందిన మహిళని అని చెప్పిందన్నారు. తమ ఇంటికి దిక్కుగా ఉన్న కొడుకును అన్యాయంగా హత్య చేశారంటూ కొన్ని ఫొటోల్నీ చూపించారన్నారు. దీనిపై పోలీసులు పట్టించుకోవడం లేదని, మరోపక్క స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా జిల్లా అధికారులు స్పందించలేదని చెప్పిందన్నారు. కేసు విచారణ చేయకుండా, నిందితులను పట్టుకోవడం లేదని ఏడ్చిందన్నారు. ఓ తల్లి వేదన వినలేప్పుడు అధికారం ఎందుకు?.. దండగ అని పవన్ అన్నారు.

మీకు 151 సీట్లు, 22 ఎంపీ స్థానాలు ప్రజలు ఇచ్చినా ఓ తల్లి గుండె ఘోష విననపుడు అధికారం ఉండి ఎందుకు దండగ అనిపించిందని పవన్ తెలిపారు. ఇటీవల తిరుపతి ఎస్పీని కలిసినపుడు మీకు సమాచారం ఎలా వస్తుంది..? మీరు చెప్పే సమాచారం ఎంత వరకు నిజం అని అడిగారన్నారు. తనకు అధికారం లేకున్నా ప్రజల బాధలు, వారి వేదనలు వినే మనసుందని, అందుకే బాధిత వర్గాలు తన దగ్గరకు వచ్చి... తమ సమస్యలు చెప్పుకుంటాయని, వారి కన్నీటి బాధను వింటానని, న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వారు వస్తారని, తనకు వారే సమాచార వారధులని ఆ ఎస్పీకి చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ వస్తే మేం ఇక్కడి నుంచి పారిపోతాం, ఉండలేం అని తనకు చెప్పుకొని బాధపడేవారే ఎక్కువ కనిపిస్తారని పవన్ తెలిపారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు... ఇలా భిన్న వర్గాల వారు జగన్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, బతకడానికి భయపడే పరిస్థితులు వచ్చేస్తాయని మధనపడుతుంటారన్నారు. అందరికీ తాను చెప్పేది ఒక్కటేనని, ఎక్కడికి వెళ్లినా జగన్ వంటి వ్యక్తులు, అతడి కంటే క్రూరమైన వారు కనిపిస్తూనే ఉంటారన్నారు.

ఓ నది ఈ నేల విడిచి ఎలా పారిపోలేదో మనం కూడా ఈ నేలను విడిచి పారిపోవాల్సిన అవసరం లేదన్నారు. సమష్టిగా, ఉమ్మడిగా పోరాడి జగన్ లాంటి వారిని తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధం ఉపయోగించి జగన్ వంటి వ్యక్తులను తరిమికొడదామన్నారు. ఈ నేల మనది రాజ్యం మనది, రాముడు మన వాడు. ఎక్కడికి పారిపోకుండానే జన రాజ్యం తెచ్చుకుందామన్నారు.
తాడేపల్లిలో సీఎం నివాసం ఉండే పోలీస్ స్టేషన్ పరిధిలోనే నేరాల రేటు ఎక్కువగా ఉందని పవన్ ఆరోపించారు. సీఎం నివాసానికి కూత వేటు దూరంలో ఓ అంధురాలిపై వేధింపులకు దిగి హత్య చేస్తే ఈ సీఎం, మంత్రుల నుంచి స్పందన ఉండదని పవన్ ఆక్షేపించారు. తనను తిట్టడానికి లేచే నోర్లు అప్పుడు మూతపడిపోతాయన్నారు. రేపల్లెలో తన సోదరిని వేధించిన వారిని ప్రశ్నించిన అమర్నాథ్ అనే బాలుడిని పెట్రోలు పోసి తగులబెట్టి హత్య చేస్తే, ఈ వైసీపీ నాయకులు రాజీ చేయడానికి వెళ్తారన్నారు. ప్రభుత్వ విధానాలపై ధైర్యంగా మాట్లాడే జనసేన అధికార ప్రతినిధి శ్రీమతి కీర్తన మీద వైసీపీ ప్రతినిధులు అనుచితంగా మాట్లాడతారన్నారు.












Click it and Unblock the Notifications