అనాథాశ్రమంలో పిల్లలతో పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల: జనసేనాని శుభాకాంక్షలు
హైదరాబాద్/అమరావతి: జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల అనాథ బాలల నడుమ ప్రీ క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. అనా కొణిదెల ఆదివారం హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్ అనాథ శరణాలయానికి వెళ్లారు. అక్కడి చిన్నారులతో కలిసి ఆమె కేక్ కట్ చేశారు.
అనాథ బాలలతో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి తెలుసుకున్నారు అనా కొణిదెల. అనాథాశ్రమం నిర్వాహకులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా అనాను జీవోదయ చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులు సత్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
తెలంగాణ ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, క్షమాగుణాలను తన జీవిత సందేశంగా మానవాళికి అందించిన ఏసు క్రీస్తు జన్మించిన పర్వదినం క్రిస్మస్. ఈ పవిత్ర పండుగ తరుణాన క్రైస్తవ మత ఆరాధకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సామాజిక విలువలు చైతన్యవంతం కావాలంటే క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం సర్వదా ఆచరణీయమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.


ప్రతి మనిషి ఎంతో కొంత పరోపకార గుణం అలవర్చుకోకపోతే జీవితానికి అర్థం ఉండదని క్రైస్తవం బోధిస్తుంది. ఈ క్రిస్మస్ పర్వదినాన దేశ ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన మనసారా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications