జనసేన సర్కార్ ఖాయం- సీఎం పదవిపై అందుకే-మరోసారి పవన్ కీలక వ్యాఖ్యలు..

ఏపీలో జనసేన ప్రభుత్వం కచ్చితంగా స్ధాపిస్తామని అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిపై జరుగుతున్న చర్చ, రాష్ట్రంలో తాజా పరిస్ధితులు, జనసేన పరిస్ధితి, వైసీపీ రాజకీయాలు వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అయ్యేలా ఉన్నాయి.

నేను కూడా జనసేనలో ఓ కార్యకర్తనే అని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను పార్టీ పెట్టగానే సీఎం అయిపోతానని కొందరు అనుకున్నారని పవన్ వెల్లడించారు. డబ్బుల్లేకుండా రాజకీయాలు చేయమంటే కాఫీలు, టీలు కూడా ఇవ్వొద్దని కాదన్నారు.

pawan kalyan confident of forming janasena government

తనకు మండలాధ్యక్షుడు అయ్యే డబ్బు కూడా లేకపోవచ్చని, కానీ పది మంది దగ్గరికి వెళ్లి డబ్బులు అడుక్కుని అయినా తెచ్చి జనానికి నాలుగు టీలు ఇస్తానన్నారు. ఓ పార్టీ నిర్మాణం కోసం చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పవన్ తెలిపారు. 2008 నాటి పరిస్ధితుల్ని కూడా తట్టుకుని జనసేన నిలబడిందన్నారు.

తాను ఓ కులానికి నాయకుడిని కాదని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను మానవతావాదినని, సమాజం బావుండాలని కోరుకునే వాడినన్నారు. తన కులానికి ఇచ్చే గౌరవంతో సమానంగా ఇతర కులాలకూ గౌరవం ఇస్తానన్నారు. ఓట్లు పడతాయో లేదో తెలియదు, కానీ తనకు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక సరిహద్దుల్లోనూ ఓట్లు ఉన్నాయని పవన్ తెలిపారు. ఇంత అభిమాన బలం ఉండి, తనను ఓ కులానికి పరిమితం చేస్తానంటే సరికాదన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పరిస్దితులు వేరని, 60 ఏళ్ల వయసు తర్వాత ఆయన వచ్చారని పవన్ గుర్తుచేశారు.

చాలా మందికి నచ్చకపోయినా పదవినే టార్గెట్ గా పెట్టుకుని రాజకీయం చేస్తే కుదరదని, నినాదాలతో సీఎం కాలేరని, ఓట్లు వేస్తేనే సీఎం అవుతారని పవన్ తెలిపారు. రోడ్లపై గజమాలలు వేస్తే, హారతులు వేస్తే కారని, ఓట్లు వేస్తేనా అవుతారన్నారు. ప్రజాభిమానం ఓట్లుగా మారకపోతే ఎంతున్నా ప్రయోజనం లేదు.

pawan kalyan confident of forming janasena government, key comments on cm post again

తాను అజాత శత్రువును కావడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. తనను చూసి కొందరు భయపడితే మంచిదేనన్నారు. రాజకీయాల్లో ఓ అభిప్రాయం చెప్పినప్పుడు వచ్చే వ్యతిరేకత తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నట్లు పవన్ తెలిపారు. ఏపీ కోసం కొందరికి శత్రువు కావడానికి సిద్ధమేనన్నారు.

137 స్ధానాల్లో గతంలో పోటీ చేసినప్పుడు 30-40 సీట్లయినా రావాలని, అప్పుడు సీఎం పదవి అడిగే పరిస్ధితి ఉండేదన్నారు. కానీ ఓట్లేయకుండా ఇప్పుడు సీఎం పదవి కావాలని కోరుకోవడం తప్పన్నారు. ఎంఐఏం ఆలోచనా విధానం నచ్చినా నచ్చకపోయినా ఆ పార్టీకి కూడా ఏడు సీట్లలో గెలుస్తున్నారన్న విషయాన్ని పవన్ గుర్తుచేశారు.

ఇంత ఆదరణ ఉండి పట్టుమని పది సీట్లు కూడా రాకపోతే ఏం చేస్తామన్నారు. పవన్ కష్టాల్లోనే గుర్తుకొస్తాడని, ఓట్లేసేటప్పుడు గుర్తుకు రావడం లేదన్నారు. మోసం చేసే వారినే నమ్ముతారేమో అని నిర్వేదం వ్యక్తం చేశారు.

నమ్మకం అనేది ఒక్క రోజులో సంపాదించలేమని పవన్ కళ్యాణ్ తెలిపారు. పరిస్దితులు అనుకూలంగా ఉన్నప్పుడు అంతా కాలర్ ఎగరేస్తారని, కానీ విపత్కర పరిస్ధితుల్లో నిలబడ్డ వాడే నాయకుడన్నారు. టీడీపీ నేతల్ని సీఎంలు చేయడానికి జనసేన లేదని పవన్ తెలిపారు. ముందు మన బలం బేరీజు వేసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.

pawan kalyan confident of forming janasena government, key comments on cm post again

ఓట్లు రావాలంటే తనంత బలంగా నేతలు జనంలో తిరగాలన్నారు. జనం కోసమే అయినా తాను కర్నాటక వెళ్లినా వస్తారన్నారు. ఇక్కడికి మించి జనం వస్తారని తెలిపారు. ప్రజాస్పందనను ఓట్లుగా మార్చుకోవడం అనేది వేరన్నారు.

ఎంఐఏం లా ఏడు స్ధానాల్లోనూ గెలిపించలేరా అని జనసేన నేతల్ని పవన్ ప్రశ్నించారు. ఎంఐఏలా, విజయ్ కాంత్ లా కూడా సీట్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. నిజాయితీగా పనిచేస్తే వచ్చే పరాభవం ఇలాగే ఉంటుందని గుర్తుచేశారు.

తనను సీఎం అభ్యర్ధిగా ప్రకటించకపోతే పొత్తు ఉండదని తమ నేతలు చెబుతున్నారని పవన్ ఆక్షేపించారు. మండల, వార్డు, డివిజన్ స్ధాయిలో మన నాయకుడే ఉండాలని కోరుకుంటే వేరే పార్టీ నేతను ఎందుకు సీఎం చేయాలనుకుంటారని ప్రశ్నించారు. 2014లో మద్దతు ఇవ్వడం వెనుక సమయాభావం, ఇతర కారణాలు ఉన్నాయన్నారు.

పదవి తీసుకోకుండా, ఒట్టి సేవ చేశాననడం సరికాదని, తనకేమైనా పిచ్చా అని పవన్ కార్యకర్తల్ని ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనూ పార్టీ ఆఫీసుకు స్ధలం కూడా తీసుకోలేదని పవన్ గుర్తుచేశారు. తనను తిట్టడానికి వైసీపీలో కొందరు బుడతల్ని తనమీదకు పంపిస్తున్నారంటూ సకల కళా కోవిదుడు అంటూ సజ్జలను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.

pawan kalyan confident of forming janasena government, key comments on cm post again

175కు 175 సీట్లు గెలవాలంటున్న వారు జనసేనను పట్టించుకోవద్దని పవన్ కోరారు. టీడీపీని అయినా వదిలేస్తున్నారని, కానీ జనసేనను మాత్రం వదల్లేక భయపడుతున్నారన్నారు. మనం ఏంటో మన ప్రత్యర్ధులు చెప్పాలన్నారు.

పొత్తుల్ని తక్కువ అంచనా వేయొద్దని పవన్ నేతల్ని కోరారు. పార్టీ పెరుగుదలకు అది దోహద పడుతుందన్నారు. ఒకప్పుడు ఆరేడు స్ధానాలు మాత్రమే గెలిచిన టీఆర్ఎస్ పొత్తులతో ఇప్పుడు జాతీయ పార్టీగా ఎదుగుతోందన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఎందుకిస్తారని పవన్ ప్రశ్నించారు.

ఈ మాటలు మాట్లాడుతున్న వారంతా భీమవరంలో తన గెలుపు కోసం ప్రచారం కూడా చేయలేదన్నారు. రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయని, అహంకారాలు, భేషజాలు ఉండవన్నారు. ఏ వ్యూహం మీరు తనకు చెప్పారని జనసేనను పదేళ్లుగా తాను నడుపుతున్నానని ప్రశ్నించారు.

సలహాలు ఇవ్వొద్దని, వ్యూహం బాధ్యత గల వ్యక్తులకు వదిలేయాలని, ప్రభుత్వం ఎందుకు రాదో చూస్తానన్నారు. డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయని, జూన్ నుంచి తిరిగేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు పవన్ తెలిపారు. పవన్ సీఎం కావాలని, జనసేన ప్రభుత్వం రావాలని కల కనండని దానికి బలమైన పునాది కూడా వేయాలని పిలుపునిచ్చారు.

pawan kalyan confident of forming janasena government, key comments on cm post again

రిజర్వేషన్లు ఇవ్వనని తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ఛీకొట్టినా ఓట్లెందుకు వేశారని కాపు నేతల్ని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని వదిలేసి రాష్ట్రం కోసం పనిచేస్తున్న వారిని ఎందుకు తిడుతున్నారని పవన్ అడిగారు. తన నడక రాని పిల్లల్ని కూడా తిడుతున్నారని, రోజుకు 2-3 కోట్ల సంపాదన వదిలిపెట్టి ఎందుకు వస్తున్నానో గుర్తించాలన్నారు.

ప్రజలు మారనంత వరకూ మార్పు రాదన్నారు. ప్రజల్లో పరివర్తన రానంత వరకూ రాజకీయాలు మారవన్నారు. రాజకీయాల్లోకి రాకపోతే తనజోలికి ఎవరూ రారని పవన్ తెలిపారు. భీమ్లానాయక్ సినిమా కక్షగట్టి ఆపేస్తే రూ.30 కోట్లు నష్టం వచ్చిందన్నారు. వేల కోట్ల కాంట్రాక్టులు, ఇసుక దోపిడీలు చేసే వారిని ప్రశ్నించాలని కాపు నేతలకు సూచించారు.

చంద్రబాబు కాపుల్ని మోసం చేశారని చెబితే నమ్మడానికి చిన్నపిల్లలమా అని పవన్ ప్రశ్నించారు. ఇతర సామాజిక వర్గాల వారిని పెళ్లి చేసుకున్న వారు ఇప్పుడు రాజకీయాల్లో కులం గురించి మాట్లాడుతున్నారని కాపు నేతలకు పవన్ చురకలు అంటించారు.

40 ఏళ్ల రాజకీయం చేసిన చంద్రబాబు భార్యనే తిడుతుంటే మీ పరిస్ధితి ఏంటని పవన్ ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లని ప్రశ్నించే గుండెదమ్ము లేనోళ్లు రాజకీయాల్లోకి రావడం అనవసరం అన్నారు. గతంలో రూపాయి పెట్టుబడి లేకుండా 7 శాతం ఓట్లు సాధించామని పవన్ గుర్తుచేశారు.

గోదావరి జిల్లాల్లో 30 శాతం, మిగతా కోస్తా జిల్లాల్లో 20 శాతం ఓటు బ్యాంకు ఉండి ఓడిపోవడానికి తాను సిద్ధంగా లేనని, కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరాలని పవన్ తెలిపారు. జనసేన త్రిముఖ పోటీల్లో బలి కావడానికి సిద్ధంగా లేదన్నారు. కచ్చితంగా పొత్తే ఉంటుందని, సీఎం ఎలా అవ్వాలా లేదా అనేది ఫలితాల తర్వాతే మాట్లాడతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+