Pawan Kalyan : వాలంటీర్లపై విమర్శల డోస్ పెంచిన పవన్-ఈసారి హైకోర్టు కామెంట్స్ తో ట్వీట్..
ఏపీలో వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాల లబ్దిదారుల సేకరణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాటల దాడి చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు వైసీపీ సర్కార్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. వాలంటీర్లు సేకరిస్తున్న డేటా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడం వల్లే రాష్ట్రంలో మహిళలు కిడ్నాప్ కు గురవుతున్నారంటూ విమర్శిస్తున్న పవన్ .. రెండు రోజులుగా వరుస వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ హైకోర్టు గతంలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఏపీలో వైసీపీ వాలంటీర్ల డేటా ఉల్లంఘనపై ఏపీ హైకోర్టు గతంలో పలు వ్యాఖ్యలు చేసింది. వీటిలో అధికారులతో కాకుండా వాలంటీర్లతో లబ్దిదారుల్ని ఎంపిక చేయించడాన్ని తప్పుబట్టింది. అలాగే వాలంటీర్ల కొనసాగింపుకు చట్టబద్ధత ఏంటని ప్రశ్నించింది. ఇప్పుడు అవే వ్యాఖ్యలతో కూడిన ఓ న్యూస్ క్లిప్ ను తన ట్వీట్ కు జత చేస్తూ పవన్ ఇవాళ ట్వీట్ చేశారు. 'వై.ఎస్.జగన్ అధికారిక పెగాసస్' వ్యవస్థ రాష్ట్ర ఖజానాతో స్పాన్సర్ చేయబడిందంటూ పవన్ ఇందులో కామెంట్ చేశారు.

మరోవైపు ఇవాళ దెందులూరు జనసేన నేతలతో భేటీ అయిన పవన్.. ఇందులోనూ వాలంటీర్లపై వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటే తనకు కోపం లేదని పవన్ తెలిపారు. ప్రజల వ్యక్తిగత సమాచారమంతా వాలంటీర్ల వద్ద ఉందని పవన్ తెలిపారు. రాష్ట్రంలో అమ్మాయిల అదృశ్యంపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించరని నిలదీశారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే తనపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని పవన్ ఆరోపించారు. అలాగే వైసీపీ నేతల విమర్శలకు తన భార్య కూడా ఏడుస్తోందన్నారు.
AP High-court on Data breach by YCP Volunteers. ‘ Y.S.Jagan’s official Pegasus’ system sponsored by State exchequer. pic.twitter.com/cGaH2QJ4wp
— Pawan Kalyan (@PawanKalyan) July 11, 2023
ఇదిలా ఉంటే వాలంటీర్లపై పవన్ చేస్తున్న వ్యాఖ్యల్ని ఖండిస్తూ వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు. వాలంటీర్లపై పవన్ కామెంట్స్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని డిమాండ్ చేశారు. ఇతర వైసీపీ నేతలు కూడా పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై పవన్ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ మహిళా కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది.












Click it and Unblock the Notifications