ఆ ప్యాకేజీ చెల్లింపుల్లో జాప్యం- కేంద్రమంత్రికి పవన్ కంప్లైంట్
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆయన హస్తినలో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తోన్నారు. ఇందులో భాగంగా జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్‌తో సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో జగన్ ప్రభుత్వం ఉద్దేశపూరకంగా కాలయాపన చేస్తోందని ఫిర్యదు చేశారు.
రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును సత్వరమే పూర్తి అయ్యేలా చొరవ చూపాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. నిధుల కొరత పేరుతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో జాప్యం చేస్తోందని చెప్పారు. ఫలితంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటోన్నాయని వివరించారు. 2019 మే నాటికి పోలవరం ప్రాజెక్టులో 72 శాతం నిర్మాణ పనులు పూర్తయితే.. ఈ నాలుగేళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో మూడు శాతం మాత్రమే పనులు జరిగాయని చెప్పారు.

విశాఖపట్నంలోని పారిశ్రామిక జోన్ నీటి అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన పోలవరం ఎడమగట్టు కాలువ పనులు పూర్తిగా స్తంభించిపోయాయని పవన్ కల్యాణ్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో తమ భూములు, వ్యవసాయ పొలాలు, ఇళ్లను కోల్పోయిన వందలాదిమంది నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారంలోనూ ఏపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. వారికి అందాల్సిన రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ ప్యాకేజీ చెల్లింపులను కూడా ఆలస్యం చేస్తోందని అన్నారు.
నిధులను విడుదల చేయట్లేదంటూ జగన్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందంటూ పవన్ కల్యాణ్ వివరించారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం, మిగిలిన 24 శాతం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా జగన్ ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావాలని గజేంద్ర సింగ్ షెఖావత్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తయితే విశాఖపట్నం, ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలకు మంచినీరు, పారిశ్రామిక, వ్యవసాయ అవసరాలకు తగినంత నీరు అందుతుందని చెప్పారు.
గోదావరి డెల్టాలో మాత్రమే కాకుండా కృష్ణా డెల్టాలోని రైతాంగానికి కూడా ఈ ప్రాజెక్టు వల్ల మేలు కలుగుతుందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావడానికి అవసరమైన నిధులను విడుదల చేయడంతో పాటు నిర్మాణ పనుల్లో వేగం పెరిగేలా చూడాలని, ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. దీనిపై గజేంద్ర సింగ్ షెఖావత్ సానుకూలంగా స్పందించారు.












Click it and Unblock the Notifications