మారుతున్న పవన్ వైఖరి.. పక్కా స్ట్రాటజీతోనే?: ఆ ఒక్క ఛానెలే ప్రత్యేక ఫోకస్..
శ్రీకాకుళం: నిన్న మొన్నటిదాకా అభిమానులంతా 'సీఎం.. సీఎం' అంటూ ఎంతగా నినాదాలు చేసిన పవన్ అంతగా స్పందించేవారు కాదు. పైగా తనది సుదీర్ఘ పోరాటమని, అధికార పీఠమే లక్ష్యంగా తాను రాజకీయాలు చేయబోనని పలుమార్లు స్పష్టం చేశారు. అయితే తాజా శ్రీకాకుళం పర్యటనలో మాత్రం ఆయన వైఖరి మారిందనే చెప్పాలి. సీఎం.. సీఎం.. అనడం కాదు, మీరంతా ఓటేస్తేనే నేను సీఎం అవుతానంటూ మనసులో మాటను బయటపెట్టేశారు. మొత్తం మీద ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీగా సాగుతున్న ప్రధాన రాజకీయ పోటీలోకి పవన్ ఎంటర్ అవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.

అభిమానుల్లో నుంచి నాయకులు పుట్టుకొస్తారా?:
మిగతా నాయకులతో పోలిస్తే పవన్ కు ఉన్న ప్రధాన బలం ఆయన సినీ గ్లామర్. రాజకీయ పార్టీల సభలకు డబ్బులిచ్చి జనాలను తరలించినట్టుగా పవన్ కు ఆ అవసరం లేకుండా వేలాది మంది వెంట నడిచే అభిమానులు ఉన్నారు. అయితే ఈ అభిమానుల్లో ఎంతమందిని పవన్ నాయకులుగా తీర్చిదిద్దుతారన్న దాని పైనే జనసేన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పటికైతే పవన్ తప్ప.. పార్టీ తరుపున మరో ముఖమేది జనసేన వేదికలపై కనిపించడం లేదు.

కొత్తవాళ్లతోనే బరిలో దిగుతారా?:
ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో దేవెందర్ గౌడ్ లాంటి సీనియర్ నాయకులను పార్టీలోకి తీసుకున్నారు. తద్వారా వారికి ఉన్న పొలిటికల్ మైలేజ్ పార్టీకి ఉపయోగపడుతుందని భావించారు. జనసేన విషయంలో మాత్రం పవన్.. వేరే పార్టీల నాయకులతోనో.. మాజీలతోనో చర్చలు జరుపుతున్నట్టు కనిపించడం లేదు. అయితే కొత్తవాళ్లతోనే పార్టీని నిలబెట్టడం అసాధ్యమేమి కాకపోయినప్పటికీ.. సవాలక్ష సవాళ్లు మాత్రం కచ్చితంగా ఉంటాయి.

ఆమ్ ఆద్మీ ఫార్ములా..:
ఢిల్లీలో కొనసాగుతున్న ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో ఉన్నది అంతా కొత్త నాయకత్వమే. కేజ్రీవాల్ నాయకత్వంలో చాలామంది కొత్తవాళ్లు నాయకులుగా ఎదిగొచ్చారు. కాబట్టి పవన్ అలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతారా? అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని 175 స్థానాలకు పోటీ చేస్తామని చెబుతున్న పవన్ కల్యాణ్.. అంతా కొత్త అభ్యర్థులనే రంగంలోకి దింపితే వారు ఏ మేర ప్రభావం చూపిస్తారన్నది చెప్పడం కష్టం.

ఆ ఒక్క ఛానెల్..:
ఇక ఈరోజుల్లో రాజకీయ పార్టీలకు మీడియా అవసరం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కొన్ని పరిణామాల తర్వాత తెలుగులో కొన్ని ప్రధాన మీడియా చానెళ్లు.. పవన్ వార్తలపై ఫోకస్ తగ్గించేశాయంటున్నారు.
ముఖ్యంగా పవన్ శ్రీకాకుళం పర్యటనకు ప్రధాన స్రవంతి మీడియాలో పెద్దగా ప్రాముఖ్యత కనిపించడం లేదు. అదే సమయంలో ఏపీ 24×7 అనే చానెల్ మాత్రం పవన్ పర్యటనపై చాలానే హడావుడి చేస్తోంది. ప్రత్యేక శ్రద్దతో పర్యటనలను కవర్ చేస్తూ.. దానిపై డిబేట్స్ కూడా నిర్వహిస్తోంది.
అయితే సదరు చానెల్ అంతలా పవన్ పర్యటనను ఫోకస్ చేయడానికి కారణం.. దాని డైరెక్టర్ గుత్తా సుమన్ జనసేన నుంచి టికెట్ కోరుతుండటమే అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున సుమన్ టికెట్ ఆశిస్తున్నారని.. అందుకే పవన్ పర్యటనపై అంతగా ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications