రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆ సంస్థ ఇండియా హెడ్ ఆదిత్య మిట్టల్, కేంద్రమంత్రి వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తదితరులతో ఈ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు.
స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పాల్గొనటం సంతోషం: పవన్ కళ్యాణ్
ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ భూమి పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న స్టీల్ ప్లాంట్ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ద్వారా లక్ష మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఉత్తరాంధ్ర ప్రజలకు ముఖ్యంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

లక్ష్మీ మిట్టల్ ను ఒప్పించి పెట్టుబడులు తెచ్చిన ఘనత చంద్రబాబుది
ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు తమల విశ్వాసాన్ని పెంచాయని, పెట్టుబడులు రావాలంటే దార్శనికత ఉన్న నేత కావాలని ఎన్నికలలో తాను చెప్పానని, అటువంటి నేత చంద్రబాబు అన్నారు. లక్ష్మీ మిట్టల్ ను ఒప్పించి పెట్టుబడులు తీసుకురావాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయ దురంధరుడు అంటూ పవన్ కళ్యాణ్ కొనియాడారు.
అనంతపురం కియాతో ఆ ప్రాంతం మారినట్టే ఇక్కడ కూడా
ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబు కారణమని అమిత్ షా చెప్పారన్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరగబోతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరుగుతుందన్నారు. అనంతపురంలో కియా పరిశ్రమతో ఆ ప్రాంత రూపురేఖలు మారినట్టు ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ తో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతున్నాయి అని అన్నారు.
పెట్టుబడులు సాధిస్తున్నాం
1.30 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమకు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులకు సానుకూలత కల్పించామని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ, పెట్టుబడులు సాధిస్తున్నాం అన్నారు. ఇప్పటికే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు కూడా పెట్టుబడులు వచ్చాయన్నారు.
మోడీ ప్రయాణం ప్రేరణాత్మకం అన్న పవన్ కళ్యాణ్
అంతేకాదు అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రభుత్వ అధిపతిగా నిరవధికంగా 8931 రోజుల సేవ పూర్తి చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయనను ప్రత్యేకంగా ప్రశంసించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన నరేంద్ర మోడీ రాజకీయ ప్రయాణం భారత ప్రధానిగా కొనసాగుతూ దేశానికి విశేష సేవలు అందించింది అన్నారు పవన్ కళ్యాణ్.












Click it and Unblock the Notifications