ఏపీలో ముందస్తుపై తేల్చేసిన పవన్- పొత్తులపైనా స్పష్టత
అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు మొదలు పెట్టనుంది. అదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలు మళ్లీ చెలరేగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముందస్తు ఎన్నికల అంశం మరోసారి తెరమీదికి వచ్చింది.
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచన లేదంటూ ఇదివరకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని తేల్చేశారాయన. ఇటీవలే నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఓ స్పష్టతను ఇచ్చారు. అయినప్పటికీ- అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు తెర పడట్లేదు.

తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ముందస్తు వస్తుందంటూ అంచనా వేశారు. ఇంకో ఆరు నెలల్లో ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. డిసెంబర్‌లో తెలంగాణతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఎన్నికలను ఎదుర్కొనడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ క్యాడర్ సంసిద్ధంగా ఉండాలని సూచించారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయానికి భూమిపూజ చేసిన అనంతరం పవన్ కల్యాణ్.. పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ నాయకులతో సమావేశం అయ్యారు. డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీతో పాటు ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయని, తెలుగు రాష్ట్రాలు రెండూ ఉమ్మడిగా కలిసి ఎన్నికలకు వెళ్తాయని అన్నారు.
ఈ సందర్భంగా పొత్తులపైనా ఓ స్పష్టతను ఇచ్చారు పవన్ కల్యాణ్. కుదిరితేనే పొత్తులకు వెళ్తామని, లేదంటే ఒంటరి పోరు తప్పదని స్పష్టం చేశారు. ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొనాల్సిన పరిస్థితే ఎదురైతే దానికి సంబంధించిన వ్యూహాలు ఎలా ఉంటాయనేది విషయంపై త్వరలో చెబుతానని పవన్ కల్యాణ్ వారికి వివరించారు.












Click it and Unblock the Notifications