ఎన్డీయేకు పవన్ గుడ్ బై ? పెడనలో పరోక్ష ప్రకటన ! త్వరలో ప్రత్యామ్నాయ కూటమి !
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మరో ముందడుగు వేశారు. చంద్రబాబు అరెస్టులో కేంద్రం పాత్ర ఉందని భావిస్తున్న పవన్, తాము వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న ఫిర్యాదుల్ని పట్టించుకోకపోవడంపైనా అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఎన్డీయేకు గుడ్ బై చెప్పేస్తున్నట్లు నిన్న పెడనలో జరిగిన వారాహి సభలో ప్రకటించారు.
ఎన్డీయేలో ఉన్నా, కష్టాలున్నా, ఇబ్బందులున్నా బయటికి ఎందుకొచ్చానంటే టీడీపీ అనుభవం కావాలి, జనసేన పోరాట పటిమ కావాలంటూ పవన్ పెడనలో చేసిన వ్యాఖ్యలో పరోక్షంగా బీజేపీకి గుడ్ బై చెప్పేసినట్లే అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ మాటమాత్రమైనా చెప్పకుండా టీడీపీతో పొత్తుపై ప్రకటన చేసేసిన పవన్..ఇప్పుడు ఎన్డీయేకు అధికారికంగా గుడ్ బై చెప్పేసి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఏపీలో ఇప్పటికే బీజేపీకి దూరంగా ఉంటున్న పవన్ పై రాష్ట్రస్దాయిలో నేతలు మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. జనసేనతో పొత్తుపై జాతీయ స్ధాయిలో నాయకత్వం చూసుకుంటుందని చెప్పేస్తున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపికయ్యాక పవన్ తో భేటీ అవుతానని ప్రకటించిన పురందేశ్వరి వంటి వారు ఇప్పుడు పవన్ ప్రతీ మాటకూ స్పందించాలా అని అడుగుతున్నారు. అదే సమయంలో కేంద్రం నుంచి కూడా పవన్ కు ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో ఇక ఎన్డీయేకు పవన్ దూరమైనట్లే అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెడనలో పవన్ వ్యాఖ్యలు ఎన్డీయేకు దూరమైనట్లు తేల్చేశాయి.
ఎన్డీయే నుంచి బయటికి వచ్చేసినట్లు పరోక్షంగా చెప్పేసిన పవన్.. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ-జనసేన-కమ్యూనిస్టు కూటమి ఏర్పాటు చేసి వైసీపీని ఎదుర్కోవాలనే నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధిస్తే జాతీయ స్ధాయిలో ఇండియా కూటమికి మద్దతిచ్చినా ఆశ్చర్యం లేదనే చర్చ జరుగుతోంది. కేంద్రంలో ప్రస్తుతానికి ఎన్డీయే బలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇండియా కూటమి బలపడుతుందన్న వాదన వినిపిస్తోంది. అందుకే పవన్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications