విశాఖలో పవన్ వ్యాఖ్యల వెనుక - పోలీసుల నోటీసులు, పునరాలోచన..!!
విశాఖ కేంద్రంగా జనసేనాని పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన రుషికొండను సందర్శించారు. రుషికొండలో కనుచూపు మేర కనిపిస్తున్నదంతా ఉల్లంఘనేనని అన్నారు. చట్టాలు పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాగని ప్రశ్నించారు.
అంతకుముందు జగదాంబ సెంటర్‌లో చేసిన ప్రసంగంపై పోలీసులు కన్నెర్ర చేశారు. ఆధారాల్లేకుండా సీఎంపైన, వైసీపీపైన విమర్శలు చేశారని.. ఇక నుంచి జాగ్రత్త గా మాట్లాడకపోతే ఆయన సభలకు అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు.

రుషికొండలో పవన్: పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా విశాఖ పర్యటన టెన్షన్ పెంచింది. పవన్ కల్యాణ్ తాజాగా రుషికొండను సందర్శించారు. ఒక ముఖ్యమంత్రికి ఎన్ని ఇళ్లు కావాలి.. ఓ మూల కూర్చోవడానికి ఒక ఇల్లు సరిపోదా అంటూ వ్యాక్యానించారు. ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో ఆలోచించడానికి రుషికొండపై సీ వ్యూ కలిగిన కార్యాలయం కావలసి వచ్చిందా అని సీఎం జగన్‌ను నిలదీశారు.
చక్కటి ప్రభుత్వ అతిథి గృహాన్ని తాకట్టు పెట్టేసి, ఆ డబ్బులతో ఇక్కడ బంగళాలు కడుతున్నారని ధ్వజమెత్తారు. కిర్లంపూడి లేఅవుట్ మొత్తం తనఖా పెట్టేశారని, వారి ధనదాహానికి అంతు లేకుండా పోతోందని.. దీనిని ఉత్తరాంధ్ర ప్రజలంతా నిలదీయాలని పిలుపిచ్చారు. ఎవరూ ప్రశ్నించకపోతే అరాచకాలు ఇంకా పెరిగిపోతాయన్నారు.

ఉత్తరాంధ్రపై పడ్డారు: తెలంగాణలో కూడా ఇలాగే దోచేశారని, అక్కడ తన్ని తరిమిస్తే ఉత్తరాంధ్రపై పడ్డారని, ఇక్కడ కూడా ప్రజలు వారి దోపిడీని ప్రశ్నించాలని, తిరగబడాలని పిలుపిచ్చారు. ఏమైనా అంటే మూడు రాజధానులు అంటారని, కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని పెడతామని ప్రకటించి కనీసం ఉపలోకాయుక్త కార్యాలయం కూడా పెట్టలేకపోయారని, అటువంటి వారు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ఎద్దేవాచేశారు.
రుషికొండపై నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘించామని ప్రభు త్వం కోర్టులోనే అంగీకరించిందని.. అయితే కొద్దిగా మాత్రమే చేశామని చెప్పిందని.. ఇక్కడ చూస్తే చాంతాడంత ఉందని చెప్పారు. ఇలాంటి నాయకులను ఎన్నుకుంటే ఇలాగే దోచుకుంటారని, ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రైవేటు ఆస్తులకు కూడా రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తంచేశారు.

పోలీసుల నోటీసులు: పవన్ కల్యాణ్ జగదాంబ సెంటర్‌లో చేసిన ప్రసంగంపై పోలీసులు కన్నెర్ర చేశారు. ఆధారాల్లేకుండా సీఎంపైన, వైసీపీపైన విమర్శలు చేశారని.. ఇక నుంచి జాగ్రత్త గా మాట్లాడకపోతే ఆయన సభలకు అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు జనసేనకు నోటీసులు ఇచ్చారు. వర్గాలను రెచ్చగొట్టేలా, కొందరిపై ద్వేషం కలిగేలా, అవమానకరంగా, ప్రశాంతతకు భంగం కలిగేలా ఆయన ప్రసంగం చేశారని, ఇలాగైతే విశాఖలో జరగబోయే సభలకు, పర్యటనలకు అనుమతి ఇవ్వడంపై పునరాలోచన చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.
నాయకులు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదు. ఒక వ్యక్తిని గానీ, బృందాన్ని గానీ, పార్టీని గానీ విమర్శించకూడదని స్పష్టం చేసారు. ప్రశాంతతకు భంగం కలగకుండా వ్యవహరిస్తామని హామీ ఇవ్వాలని సూచించారు. నిబంధనలకు కట్టుబడి ఉండాలి. లేదంటే నాయకులు, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications