జగన్‌ని ఏకేసిన లోకేష్: పవన్ హెచ్చరిక, 2019లో పోటీ
విశాఖ/ఏలూరు: చంద్రబాబు నాయుడుని గెలిపిస్తే సీమాంధ్ర ప్రాంతాన్ని సింగపూర్ చేస్తారని, అదే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే సింగపూర్‌ను కొంటారని తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ శుక్రవారం ఎద్దేవా చేశారు. లోకేష్ విశాఖ జిల్లాలోని అరకు, పాడేరులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైయస్ జగన్ సీమాంధ్రను అమ్మి సింగపూర్ కొంటారన్నారు.
జగన్ పైన నిప్పులు చెరిగిన పవన్
వైయస్ జగన్ పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం నిప్పులు చెరిగారు. జగన్ దోచుకొని జైలుకు వెళ్తే, తాను సీమాంధ్ర ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని పవన్ అన్నారు. తాను జగన్‌లా దోపిడీలు, దొమ్మిడీలు చేయలేదని మండిపడ్డారు. సీమాంధ్ర ప్రాంతం ఆత్మగౌరవం కోసం జైలుకెళ్లేందుకు సిద్ధమన్నారు.

జగన్ సిఎం అయితే భూకబ్జాలు, బాంబుల దాడుల సంస్కృతి గోదావరి జిల్లాలకు కూడా వ్యాప్తిస్తుందని హెచ్చరించారు. తన పైన దాడులు చేసినా భయపడే ప్రసక్తి లేదన్నారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేస్తామని చెప్పారు. సీమాంధ్ర భవిష్యత్తు బాగుండాలంటే, అవినీతిరహిత పాలన కావాలంటే టిడిపి, బిజెపి కూటమిని గెలిపించాలన్నారు.
జగన్ సిఎం అయితే గోదావరి జిల్లాల్లో దోపిడీలు జరుగుతాయ్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తాను చంద్రబాబు నాయుడికి మద్దతిస్తున్నట్లు చెప్పారు. ప్రధానిగా మోడీ, సిఎంగా చంద్రబాబు ఉంటే సీమాంధ్ర సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు హఠావో.. సీమాంధ్ర బచావో అని నినదించారు. పవన్.. నర్సాపురం, తణుకు తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications