TDP అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి చెందిన సోషల్ మీడియా బాధ్యతలను ఇద్దరు కీలక నేతలకు అప్పగించారు. దీనికి సంబంధించి పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఇద్దరు సలహాదారులను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.
టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డిని సలహాదారులుగా నియమించారు. ప్రస్తుతం ఐటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాలయ విజయ్ ఆధ్వర్యంలో నడుస్తోంది. తాజాగా సలహాదారులుగా నియమితులైన పయ్యావుల, జీవీ రెడ్డి విజయ్ కు సహకారం అందించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజా సమస్యలపై సోషల్ మీడియాను బలోపేతం చేసేలా వీరంతా కృషిచేస్తారని అచ్చెన్నాయుడు ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రధాన మీడియా అయిన పత్రికలు, టీవీ ఛానల్స్ కన్నా టీడీపీ, వైసీపీలు సోషల్ మీడియానే నమ్ముకున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూపుల్లో ప్రభుత్వ అవినీతి పనుల గురించి టీడీపీ పోస్టులు చేస్తుండగా, వాటిని వైసీపీ సోషల్ మీడియా తిప్పి కొడుతుంటుంది. వైసీపీ తాజాగా నియోజకవర్గాలవారీగా ప్రచారం నిర్వహిస్తోంది. తాము కూడా అదే బాటలో నడవాలని టీడీపీ నిర్ణయించింది. విజయ్ కు అవసరమైన సలహాలు, సూచనలు లోకేష్ అందించేవారు. 27వ తేదీ నుంచి ఆయన పాదయాత్ర చేస్తుండటంతో సీనియర్లుగా ఉన్న పయ్యావుల కేశవ్, జీవీరెడ్డికి ఈ బాధ్యతల్ని అప్పగించినట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో ఈ రెండు పార్టీల మధ్య పోరు హోరాహోరీగా నడవబోతోంది. అందులో ప్రధాన బాధ్యత సోషల్ మీడియాదే.












Click it and Unblock the Notifications