అన్నదాత సుఖీభవ పథకం అమలులో వీరికి ఎగనామమే..!!
పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నారు. ఈ సారి రైతుల ఖాతాల్లో రూ 7 వేలు జమ కానున్నాయి. ప్రధాని మోదీ 23వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంలో భాగం గా రూ 5 వేలు జమ చేస్తున్నారు. కాగా.. ఇదే సమయంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు పైన విమర్శలు మొదలయ్యాయి. లబ్దిదారుల జాబితాలో కోత పైన నిలదీస్తున్నాయి.
అన్నాదాత సుఖీభవ పథకం పైన పీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. అన్నదాత సుఖీభవ కాదు దుఃఖిభవ అని విమర్శించారు. మూడో ఏడాది సైతం రైతులకు మోసమే... పెట్టుబడి సాయాన్ని చంద్రబాబు మొక్కుబడి చేశారన్నారు. రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని అరకొర విధింపులతో మమ అనిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 80 లక్షల మంది అర్హత కలిగిన రైతన్నలు ఉంటే, ఈ ఏడాది సైతం ఇస్తున్నది కేవలం 46.86 లక్షల మందికే అందుతుందని చెప్పుకొచ్చారు. ముచ్చటగా 30 లక్షల మంది రైతులకు మళ్లీ ఎగనామమేనని వ్యాఖ్యానించారు. తొలి ఏడాది ఎగ్గొట్టారని... రెండో సంవత్సరం రైతులకు కత్తెరేశారని.. మూడో యేడు పథకాన్ని నామమాత్రం చేశారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేసారు.

పీఎం కిసాన్ తో సంబంధం లేకుండా రూ 20 వేలు ఇవ్వాలి
సుఖీభవను సగం సగం చేశారని... పంట నష్ట పరిహారాన్ని ఎగ్గొట్టారని షర్మిల తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా షర్మిల తన ట్వీట్ లో..."మద్దతు ధరలకు మంగళం పాడారు. పంట భీమాకి ధీమా లేకుండా చేశారు. ఎరువులు ఇవ్వకుండా రైతులను అరిగోస పెట్టారు. కార్డులు ఇస్తామని నమ్మబలికి 30 లక్షల మంది కౌలు రైతులను కకావికలం చేశారు. అండగా నిలబడడం కాదు.. వ్యవసాయాన్ని చేసింది దండుగ. రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం మార్చింది అగమ్యగోచరం. అన్నదాత సుఖీభవపై చంద్రబాబు పెట్టింది మడతపేచి. కేంద్రంతో సంబంధం లేకుండా అని చేసింది నమ్మకద్రోహం. తానే ప్రతి రైతుకు 20 వేలు ఇస్తామని, కేంద్రం ఇచ్చేది బోనస్ అని మాట మార్చడం రైతులకు చేసిన తీరని అన్యాయం. PM కిసాన్ సమ్మాన్ నిధి 6 వేలను జత చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి రైతుకి 20 వేలు ఇవ్వాల.." అని షర్మిల డిమాండ్ చేసారు.













Click it and Unblock the Notifications