ఇంకా బుద్ధి రాలేదు.. తాట తీస్తా: రోజాకి సుజాత గట్టి వార్నింగ్, జగన్ ఫ్లెక్సీ చించివేత
విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మంత్రి పీతల సుజాత మంగళవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినా రోజాకు ఏమాత్రం బుద్ధి రాలేదని విమర్శలు గుప్పించారు.
మంగళవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్న రోజాను పూర్తికాలం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితులను అవమానించడమే ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనుక ఉండి రోజాతో గేమ్ ఆడిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రోజా హద్దు మీరి మాట్లాడితే ఏమాత్రం సహించేది లేదని మంత్రి సుజాత హెచ్చరిక చేశారు.

నా వడ్డానం గురించి రోజా చెప్పకుంటే ఆమె తాట తీస్తానని సుజాత హెచ్చరించారు. దళితుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. జగన్, రోజా ఇద్దరు కూడా దళితులకు క్షమాపణ చెప్పాలన్నారు. దళితులపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
రోజాకు పిచ్చి బాగా ముదిరిందని మండిపడ్డారు. వైసిపికి అధ్యక్షులు రోజానా లేక జగనా అని ఎద్దేవా చేశారు. రోజాను శిఖండిలా అడ్డు పెట్టుకొని దళితుల పైన జగన్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో రోజా అనుచిత వ్యాఖ్యలు చేసిందన్నారు.
పెనుమాకలో జగన్ ఫ్లెక్సీ చించివేత
గుంటూరు జిల్లా పెనుమాకలో వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. దీంతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ ఫ్లెక్సీ చించివేయడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అనంతరం జగన్‌కు పాలాభిషేకం చేశారు.
'ఆర్టీసి కార్మికులను ప్రభుత్వం విస్మరిస్తోంది'
ఆర్టీసీ కార్మికులను ఏపీ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కార్మికుల సమస్యల కోసం రూ.5వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న ఆర్టీసీ మజ్దూర్ ఎన్నికల్లో 126 స్థానాల నుంచి వైసిపి పోటీ చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications