సింహాచలం ప్రమాదం- మోదీ, చంద్రబాబు కీలక ప్రకటన..!!
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఈ ఘటన పైన ప్రధాని మోదీ స్పందించారు. సంతాపం తెలిపారు. పరిహారం ప్రకటించారు. సీఎం చంద్రబాబు సైతం ఈ ఘటన లో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ.. విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాల్లో వారికి దేవాదాయ శాఖ లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇవ్వనున్నారు.
మోదీ స్పందన
సింహాచలంలో ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురి మృతి పట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50,000ల చొప్పున పరిహారం ప్రకటించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ కౌంటర్ వద్ద ఉన్న ఓ గోడ కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది.

విచారణకు ఆదేశం
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ వర్షాలతో గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. ప్రమాదంపై ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటనకు గల కారణాలు, క్షేత్రస్థాయిలో అందుతున్న సాయం తదితర అంశాలపై అధికారులు ఆయనకు వివరించారు. ఈ క్రమంలోనే మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని చంద్రబాబు ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పారు. గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications