టీడీపీ కూటమి ప్రజా గళం వేదికపై అరుదైన దృశ్యం: దిగాలంటూ మోదీ ఆదేశం
TDP Janasena BJP alliance: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి తొలి బహిరంగ సభను నిర్వహిస్తోంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఈ సభ ఏర్పాటైంది. దీనికి ప్రజాగళం అని పేరు పెట్టారు.
ఈ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉమ్మడిగా ఎదుర్కొనడానికి మహాకూటమిగా ఏర్పడ్డాయి ఈ మూడు పార్టీలు కూడా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే ఉద్దేశంతో కూటమి కట్టినట్లు ఈ మూడు పార్టీల అధినేతలు స్పష్టం చేశారు. సీట్ల పంపకాలు సైతం పూర్తయ్యాయి. ఈ మూడు పార్టీలు కలిసి తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభ కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. వేదికను పంచుకున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం ఒకే వేదికపై ఈ ముగ్గురూ కనిపించారు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా టీడీపీ- బీజేపీ కూటమి కట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ అలయన్స్‌కు మద్దతు ఇచ్చారు పవన్ కల్యాణ్. మోదీ, చంద్రబాబుతో కలిసి వేదికను పంచుకున్నారు.
ఇప్పుడు మళ్లీ అలాంటి దృశ్యమే ప్రజా గళం సభా వేదికపై కనిపించింది. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ వేదికపైకి చేరుకోవడం పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఆయనకు జ్ఞాపికను అందజేశారు.
టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, వై సత్యకుమార్.. వంటి జనసేన, బీజేపీ నాయకులు వేదికపై ఆసీనులయ్యారు. పవన్ కల్యాణ్ ప్రసంగంతో ఈ సభ ఆరంభమైంది.
పవన్ కల్యాణ్ ప్రసంగిస్తోన్న సమయంలో మోదీ మైక్ అందుకున్నారు. వేదిక ఎదురుగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్ల టవర్‌ను ఎక్కిన అభిమానులను కిందికి దిగాలంటూ మోదీ ఆదేశించారు. అక్కడ విద్యుత్ తీగలు ఉన్నాయని, వారిని వెంటనే కిందికి దించాలంటూ పోలీసులకు సూచించారు.












Click it and Unblock the Notifications