ఏపీలో చంద్రబాబు పాలన పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రాల వారీగా పార్టీ ఎంపీలతో ప్రధాని నేరుగా సమీక్ష చేస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు.. చంద్రబాబు పాలన గురించి ప్రధాని మోదీ ఆసక్తి కర విశ్లేషణ చేసారు. ప్రతిపక్షాల గురించి ప్రస్తావించారు. తెలంగాణ ఎంపీలకు.. అక్కడి పరిస్థితుల పైన ఉన్న ఫీడ్ బ్యాక్ వివరిస్తూ కీలక దిశా నిర్దేశం చేసారు.
ఏపీ, తెలంగాణ, అండమాన్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని అల్పాహార విందు ఇచ్చారు. 15 మంది ఎంపీలతో సుమారు అరగంటపాటు మాట్లాడారు. ఏపీ, తెలంగాణ లో ప్రస్తుత రాజకీయ అంశాలను ప్రస్తావించారు. ఎంపీల నుంచి పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు.. ప్రజా స్పందన గురించి అడిగి తెలుసుకున్నారు. గతం కంటే పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందని ఎంపీ లు ప్రధానికి వివరించారు. అదే సమయంలో ఏపీలో సీఎం చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో పరిపాలనపై కూడా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని చెప్పారు. ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని.. ఇది మంచి పరిణామంగా పేర్కొన్నారు. ఎన్డీఏ పైన ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను బలంగా తిప్పికొట్టాల ని సూచించారు. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని.. దీనికి అనుగుణంగా టీంలను తయారు చేయాలని నిర్దేశించారు.
కాగా, తెలంగాణ ఎంపీల పైన ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్ ఉందని.. పార్టీ నేతలు మాత్రం సమర్ధంగా వ్యవహరించటం లేదన్నారు. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని వ్యాఖ్యానించారు. మంచి టీమ్‌ని పెట్టుకుని సమర్థంగా ఎదుర్కోవడానికి సమస్య ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరగడానికి మంచి అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నారని అసహనం వ్యక్తం చేసారు.
జాతీయ పరిణామాలపై తెలుగు ఎంపీలు యాక్టివ్‌గా ఉండాలని, పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మోదీ సూచించారు. తెలంగాణలో ముఖ్య నేతలు తరచూ పర్యటనలు చేసేలా జాతీయ నాయకత్వంతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలం మరింతగా పెరిగేలా వ్యవహరించాలని ప్రధాని మోదీ ఎంపీల కు దిశా నిర్దేశం చేసారు.












Click it and Unblock the Notifications