చంద్రబాబు సమర్ధతకు పరీక్ష పెడుతున్న నియోజకవర్గం..!!
ఏపీ ఎన్నికల్లో హోరా హోరీ సమరం నడుస్తోంది. సీఎం జగన్ అధికారం నిలబెట్టుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తులో భాగంగా సీట్ల సర్దబాటు కొత్త వివాదాలకు కారణం అవుతోంది. విజయవాడ పశ్చిమం కోసం టీడీపీ, జనసేన నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతల అల్టిమేటం ఇప్పుడు చంద్రబాబు సమర్ధతకు పరీక్షగా మారుతోంది.
మారుతున్న లెక్కలు : విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు పట్టు సాధించాలనేది చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల ఫలితాల తరహాలోనే ఆధిపత్యం నిలబెట్టుకోవాలనేది జగన్ వ్యూహం. అందులో భాగంగా సిట్టింగ్ ఎంపీ కేశినేనిని తమ పార్టీలోకి ఆహ్వానించి సీటు ఖరారు చేసారు. ఇప్పుడు విజయవాడ నగరంలోని మూడు స్థానాలకు వైసీపీ అభ్యర్దులను ప్రకటించారు. విజయవాడ పశ్చిమ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్ కు మార్పు చేసారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొత్త ఇన్‌చార్జి షేక్ ఆసిఫ్ ను ప్రకటించారు. 2009లో ప్రజారాజ్యం నుంచి ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు. 2014, 2019 నుంచి వైసీపీ అభ్యర్దులే వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనేది వైసీపీ టార్గెట్.

సీటు కోసం సమరం : ఇదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు నుంచి రెండు పార్టీలకు చెందిన నేతలు సీటు ఆశిస్తున్నారు. జనసేన కోరుతున్న సీట్ల జాబితాలో ఈ నియోజకవర్గం ఉంది. ఇదే సమయంలో బీజేపీ కూటమిలో చేరితో విజయవాడ సెంట్రల్ సీటు ఆశిస్తోంది. పశ్చిమం నుంచి టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పోటీ పడుతున్నారు. బుద్దా వెంకన్న చంద్రబాబు ఫొటోకు రక్తాభిషేకం చేసి తన అభిమానం చాటుకున్నారు. సీటు ఇవ్వాలని అభ్యర్దించారు. జలీల్ ఖాన్ ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. టీడీపీ నుంచి బుజ్జగింపులు ప్రారంభం కావటంతో పార్టీ అధినేత తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అటు, జనసేన నుంచి పోతిన మహేష్ సీటు ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. ఆ పార్టీలోనూ మైనార్టీ నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు.

చంద్రబాబుకు పరీక్ష : వైసీపీకి పట్టున్న నియోజవర్గం కావటంతో ఇక్కడ రెండు పార్టీలు సమన్వయంతో పని చేస్తేనే గట్టి పోటీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి రెండు పార్టీల నుంచి పోటీ పోటీగా సీటు కోసం రాజకీయం కొనసాగుతోంది. సీట్ల పంపకాల పైన తుది నిర్ణయం జరిగిన తరువాతనే ఇక్కడ గెలుపు ఓటమలు పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజకీయంగా విజయవాడ నగరం కీలకం కావటంతో పాటుగా.. ఎంపీ సీటు నెగ్గాలంటే నగరంలోని మూడు నియోజకవర్గాల్లో వచ్చే సీట్లే ఇరు పార్టీలకు కీలకం కానున్నాయి. బీజేపీ కూటమిలోకి వస్తే ఎంపీ సీటు ఆ పార్టీకి వెళ్తుందనే ప్రచారం మొదలైంది. ఈ సమయంలో విజయవాడ పశ్చిమంలో సీటు ఖరారు..నేతలను నియంత్రించే అంశంతో పాటుగా ఇక్కడ గెలుపు చంద్రబాబు సమర్ధతకు పరీక్షగా మారుతోంది.












Click it and Unblock the Notifications