ఓట్లు దండుకోవడం కాదు, పేద గుండెల్లో బతకాలి: జగన్
చిత్తూరు: రాజకీయాలు చేయడమంటే ఓట్లు దండుకోవడం, రాష్ట్రాన్ని ఎలా విభజించాలో ఆలోచన చేయడం కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా ఆయన మంగళవారం చిత్తూరు జిల్లాలోని నారాయణవనం గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంతకుముందు ఆయన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. పేదవాడి గుండెల్లో ఎలా బతకాలో నేర్చుకోవాలని రాజకీయ నాయకులకు సూచించారు. శాసనసభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పార్టీకి చెందిన ఇరు ప్రాంత నాయకులతో విభిన్న వాదనలను చేయిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులకు విశ్వసనీయత ఉండాలని జగన్మోహన్ రెడ్డి అన్నారు.

ప్రజలకు న్యాయం చేసే ఆలోచన ఉండాలని జగన్ చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 30 పార్లమెంటు స్థానాలను గెలుచుకుందని అన్నారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎవరు సమైక్యంగా ఉంచేందుకు కట్టుబడి ఉంటారో వారినే ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోపెడదామని తెలిపారు.
ఢిల్లీ అహంకారానికి తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రస్తుతం యుద్ధం జరుగుతోందని చెప్పారు. పేదలకు ఉత్తమ వైద్య సేవలందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోతే నీళ్ల కోసం కొట్టుకు చావాలా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
విభజన రాజకీయ కుట్రే: బాబురావు
హైదరాబాద్: రాష్ట్ర విభజన వెనక రాజకీయ కుట్ర దాగివుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు గొల్ల బాబురావు ఆరోపించారు. శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగువారి సహకారంతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన యూపిఏ సర్కారు.. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తోందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications