విజయవాడ కేంద్రంగా.. సామాజిక సమతా సంకల్ప సభ
Ambedkar statue: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తయిన కాంస్య విగ్రహావిష్కరణ గడువు సమీపిస్తోంది. ఇంకో రెండు రోజులే మిగిలివుంది. ఈ నెల 19వ తేదీన సాయంత్రం 4 గంటలకు నిర్వహించబోయే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ఇదివరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం, విజయవాడకు చెందిన పార్టీ సీనియర్ నేతలు, అధికారులు పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో పాటు స్మృతివనాన్నీ ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

ఈ కార్యక్రమానికి పలు జిల్లాల నుంచి సుమారు లక్షమంది హాజరు కానున్నారు. భారీగా స్వరాజ్ మైదానానికి తరలివచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేస్తోన్నారు అధికారులు. బారికేడ్లను ఏర్పాటు చేస్తోన్నారు. దాదాపుగా అన్ని జంక్షన్లలోనూ భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను అమర్చుతున్నారు.
సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో స్వరాజ్ మైదాన్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది ఏపీ ప్రభుత్వం. సామాజిక న్యాయ మహాశిల్పంగా నామకరణం చేసింది. 19 ఎకరాల్లో స్మృతివనాన్ని ఏర్పాటు చేసింది. అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో కూడిన ఫొటో గ్యాలరీ, కన్వెన్షన్ సెంటర్‌ను ఇందులోనే నిర్మించింది.

ఈ కార్యక్రమం పోస్టర్‌ను మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీలు నందిగాం సురేష్, వీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సామాజిక సమతా సంకల్ప సభగా పేరు పెట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications