ఏపీలో విద్యుత్ కోతలు తాత్కాలికమే కానీ, ఈ నెలాఖరు వరకు ఇబ్బందులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న విద్యుత్ కోతలపై ఇంధన శాఖ కార్యదర్శి బి శ్రీధర్ స్పందించారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న విద్యుత్ ఇబ్బందులు తాత్కాలికమేనని అన్నారు. గృహ, వ్యవసాయ వినియోగానికి ఆటంకాలు కలగకూడదనే పరిశ్రమల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు.

ఏప్రిల్ చివరి వారం వరకు విద్యుత్ ఇబ్బందులు
ప్రస్తుతం రాష్ట్రంలో 230 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ డిమాండ్ ఉండగా, 180 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని పేర్కొన్నారు. ఇక పరిశ్రమల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షల వల్ల 20 మిలియన్ యూనిట్ల మేర భారం తగ్గుతుందన్నారు. పరిశ్రమల్లో ఆంక్షలు విధించినా.. మరో 30 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఏప్రిల్ చివరి వారం వరకు విద్యుత్ ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉందన్నారు.

బొగ్గు కొరత.. అవసరమైతేనే విద్యుత్ కోతలు
మరీ అవసరమైతే తప్ప.. గృహ, వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కోతలు విధించవద్దని ఆదేశాలిచ్చామని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో ఓ గంట సేపు, పట్టణ ప్రాంతాల్లో అరగంట సేపు విద్యుత్ కోతలు విధిస్తామని తెలిపారు. విద్యుత్ కొరత ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉందన్నారు ఇంధన కార్యదర్శి శ్రీధర్. ఏపీలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమైన బొగ్గు కొరత ఇప్పటికీ కొనసాగుతోందని శ్రీధర్ తెలిపారు. గతంలో 24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేవని, ఇప్పుడు ఆ నిల్వలు లేవన్నారు. అయితే, ప్రస్తుతం ఏ రోజుకారోజు బొగ్గు తెచ్చుకుని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకుంటున్నట్లు ఆయన వివరించారు.
Recommended Video


ఏపీలో ఇప్పటికే పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 3 డిస్కంల పరిధిలో ఏప్రిల్ 8 నుంచి 22 వరకు రెండు వారాలు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటిస్తున్నట్లు ఏపీ ట్రాన్స్-కో తెలిపింది. ప్రాసెసింగ్ పరిశ్రమలు 50 శాతం మాత్రమే విద్యుత్ వాడుకోవాలని పేర్కొంది. పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్ హాలిడే విధిస్తున్నట్లు, వారాంతపు సెలవుకు ఇది అదనంగా ఉంటుందని ట్రాన్స్ కో వెల్లడించింది. ఈ మేరకు మూడు డిస్కంల పరిధిలో పవర్ హాలిడే ప్రకటనలు విడుదలయ్యాయి.












Click it and Unblock the Notifications