అయోధ్యకు ప్రభాస్ రూ. 50 కోట్ల విరాళం?: నిజం ఇదే
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమానికి ప్రముఖ నటుడు ప్రభాస్ రూ. 50 కోట్లు విరాళంగా ఇచ్చారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ఈ వార్త విస్తృతంగా చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ టీం స్పందించింది. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరింది.
దేశం యావత్ ఎంతో భక్తి పారవశ్యంతో ఎదురుచూస్తున్న చారిత్రక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ప్రభాస్ కు కూడా రామ మందిర ప్రారంభోత్సవ వేడుకకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామ మందిరానికి రూ. 50 కోట్లు విరాళంగా ఇచ్చారంటూ ప్రచారం జరిగింది.

అంతేగాక, ఈ విషయాన్ని కోనమసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇటీవల చెప్పడం గమనార్హం. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భోజనం ఖర్చులు ప్రభాస్ పెట్టుకుంటున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు వైరల్‌గా మారింది. దీంతో పలు మీడియా సంస్థల్లోనూ వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్ ప్రచారం జరుగుతున్న వార్తలపై ప్రభాస్ టీంను సంప్రదించింది. దీంతో ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని హీరో టీం స్పష్టం చేసింది. కాగా, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చే భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నివేల మంది వచ్చినా.. వారందరికీ అన్నదానం అందించనున్నారు. ఇందుకు రామ మందిర ట్రస్ట్, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 500 ఏళ్ల కల నెరవేరుతుండటంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖులతోపాటు లక్షలాది మంది భక్తులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications