కేసీఆర్ బెదిరింపుతో పెట్టుబడులు రావట్లేదు: ప్రతాప్, జగన్ పార్టీలోకి టీడీపీ ఉషశ్రీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బెదిరింపుల వల్లే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ప్రతాప్ రెడ్డి సోమవారం ఆరోపించారు. పడిపోయిన రెవెన్యూను పెంచుకునేందుకు భూమ్ సృష్టించాలనే ప్రయత్నంలో భాగంగానే హెలికాఫ్టర్ సర్వేలు అంటూ హడావుడి చేస్తున్నారన్నారు.
మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. గజ్వేల్‌లో 30 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు ఉదయం సమావేశమయ్యారు.
ఆదివారం బీజేపీ నేతలతో జరిగిన చర్చల సారాంశంతో పాటు టీటీడీ పాలకమండలితో సహా నామినేటెడ్ పదవులపై చర్చించారని తెలుస్తోంది. త్వరలోనే టీటీడీకి బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నందున అందులో తెలంగాణ ప్రాంతం నుంచి ఒకరికి అవకాశం కల్పించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న టీటీడీ బోర్డులో స్థానాన్ని ఆశిస్తుండగా వీరిద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు. మరొక సభ్యుడిని శ్రీశైలం బోర్డు లేదా విజయవాడ దుర్గ గుడి ట్రస్టు బోర్డులో అవకాశం కల్పించవచ్చంటున్నారు.
జగన్ పోరాటాలు చూసి చేరా: ఉషశ్రీ చరణ్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఉషశ్రీ చరణ్ సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాదులోని లోటస్ పాండులో వైసీపీ కార్యాలయంలో జగన్ సమక్షంలో ఆమె వైసీపీ కండువా కప్పుకున్నారు. ఉషశ్రీ చరణ్ సొంతూరు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం.
ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. వైయస్ జగన్ చేస్తున్న పోరాటాలు చూసే తాను పార్టీలో చేరానని ఆమె తెలిపారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. కాగా, అనంతపురం జిల్లా నేతలతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.












Click it and Unblock the Notifications