ఏపీ మంత్రికి ఎయిడెడ్ సెగ- నేడు అనంతకు లోకేశ్ : రాజకీయాలు చేస్తే సహించం..!!
రాష్ట్రంలో కొనసాగుతున్న ఎయిడెడ్ నిరసనలు ఏకంగా విద్యా శాఖ మంత్రిని తాకాయి. అనంతపురంలో విద్యార్దుల పైన లాఠీఛార్జ్ జరిగిందని ఆరోపిస్తూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే, పోలీసు అధికారులు లాఠీఛార్జ్ చేయలేదని స్పష్టం చేస్తున్నాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో విద్యార్ధి సంఘాల నేతలు ఆ ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు మంత్రిని నిలదీశారు. విద్యార్థులకు, మంత్రికి మధ్య వాగ్వాదం జరిగింది.

మంత్రి సురేష్ ను నిలదీస్తూ
చివరకు పోలీసులు వచ్చి ఆందోళనకారులను బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో తరలించారు.మీడియా సమావేశం జరగుతున్న సమయంలో విద్యార్ధి సంఘాల నేతలు తమ సంస్థల బ్యానర్లతో ఆందోళనకు దిగారు. మీడియా సమావేశం మధ్యలోనే మంత్రి వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. గాయపడిన విద్యార్థిని జయలక్ష్మిని పోలీసులు కొట్టలేదని, ఎవరో రాయి విసరడంతోనే ఆమెకు గాయమైందని వివరించారు. ఎయిడెడ్ కళాశాలల విలీనంతో నష్టమేమీ లేదని, ఫీజులను ప్రభుత్వమే ఇస్తుందన్నారు.

విద్యార్ధులతో రాజకీయం పులిమీద స్వారీ లాంటిది
ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ఎయిడెడ్ కళాశాలల విలీనం వద్దన్నందుకు పోలీసులతో దాడి చేయించడమేంటని విద్యార్థులు ప్రశ్నించారు. జీవో నెంబర్ 46 ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసారు. అనంతపురంలోని కళాశాలలో విద్యార్థులపై జరిగిన దాడి ప్రతిపక్షాలు, చంద్రబాబు కుట్రేనని విమర్శించారు. ఎయిడెడ్ కళాశాలల విలీనాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. విద్యార్థులతో రాజకీయం చేయాలని లోకేశ్ అనుకుంటున్నారని, ఇది పులిమీద స్వారీలాంటిదని మంత్రి వ్యాఖ్యానించారు.

అనంతపురంకు లోకేశ్
కాగా, గాయపడిన విద్యార్థినీ విద్యార్థులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించనున్నారు. అయితే కళాశాలలో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఇస్తే ఒప్పుకోబోమని మంత్రి సురేశ్ పేర్కొన్నారు. ఇక, లోకేశ్ ఈ రోజు అనంతపురం పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన అనంతపురం జిల్లా పర్యటనకు ఇప్పటికే బయల్దేరారు. అనంతపురం నగరంలోని ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులతో లోకేశ్ ముఖాముఖి మాట్లాడనున్నారు.
Recommended Video

వివాదానికి ప్రభుత్వం ముగింపు ఇస్తుందా
గాయపడిన విద్యార్ధిని జయలక్ష్మీ సైతం ఇప్పటికే వీడియో సందేశం విడుదల చేసారు. తనకు రాయి తగలటం వలనే గాయం అయిందని చెప్పారు. అదే సమయంలో తాను తెలిసిన వారి ఇంట్లో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు లోకేశ్ తో పాటుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ సైతం అనంతపురంలో విద్యార్ధులతో ముఖాముఖీ నిర్వహించనున్నారు. అనంతపురం వేదికగా మొదలైన విద్యార్ధుల ఎయిడెడ్ నిరసనలు ఇప్పుడు విజయవాడ దాకా విస్తరించింది. ఇక, ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications