జగన్‌ను చంద్రబాబు ద్వారా టార్గెట్ చేసిన పురందేశ్వరి..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి పాలనా పగ్గాలు చేపట్టి పని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తాజాగా చేసిన విజ్ఞాపనలు జగన్ కు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు అంశాల పైన కీలక విజ్ఞాపనలు చేశారు పురందేశ్వరి.
చంద్రబాబుకు పురందేశ్వరి విజ్ఞాపనలు
ఇసుక, మద్యం తో పాటు పలు కీలక అంశాలను ప్రస్తావించిన పురందేశ్వరి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేయించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం విక్రయాలతో పాటు ఎక్సైజ్ మరియు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతి పైన విచారణ చేయించాలని కోరారు. అంతేకాదు గత ఐదేళ్లలో జరిగిన ఇసుక దోపిడీపైన కూడా సమగ్ర విచారణకు ఆదేశించాలని పురందేశ్వరి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

ఇసుక తవ్వకాలపై పురందేశ్వరి ఏమన్నారంటే
ఈ మేరకు చంద్రబాబుకు వినతి పత్రాలను అందజేసిన ఆమె ఈ అంశాలను పరిశీలించారని కోరారు. ఇక చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన అనంతరం మాట్లాడిన పురందేశ్వరి రాష్ట్రంలో గత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో ఇసుక దోపిడీ కారణంగా భవన నిర్మాణ కార్మికుల జీవితాలు దెబ్బతిన్నాయన్నారు. ఎక్కడా కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను పాటించకుండా ఇసుకను తవ్వేసారని ఆరోపించారు.
వైసీపీ నేతలు దోచుకున్నారు.. విచారణ చేయించండి
ఇసుక తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని, వైసీపీ ఇసుక విధానంతో వైఎస్ఆర్సిపి నేతలు భారీ ఎత్తున దోచుకున్నారని పురందేశ్వరి ఆరోపించారు. గత ఐదేళ్లలో జరిగిన ఇసుక తవ్వకాలపైన విచారణ జరిపించాలని ఆమె కోరారు. అంతేకాదు వైసిపి హయాంలో నాణ్యతలేని లిక్కర్ విక్రయాలు జరిగాయని ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అన్నారు పురందేశ్వరి.
I urge @ncbn Garu for a CBI investigation into this entire incident and to ensure the safe supply of quality liquor in AP through digital platforms pic.twitter.com/D0Byaz0KZT
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) June 21, 2024
మద్యం విక్రయాలపైనా విచారణ చెయ్యాలన్న బీజేపీ ఏపీ చీఫ్
ఏపీలో అధికారిక లెక్కల ప్రకారం 33 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని, మద్యం కొనుగోలు, అమ్మకంలో తేడా 400 శాతం నుంచి 500 శాతం వరకు ఉందని ఇదంతా వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందంటూ ఆరోపించారు. ఈ క్రమంలోనే మద్యం విక్రయాల పైన, ఎక్సైజ్ మరియు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ పైన విచారణ జరిపించాలని ఆమె చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
జగన్ ను టార్గెట్ చేసిన ఏపీ బీజేపీ
ఇక ఈ వినతి పత్రాల ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు పురందేశ్వరి. పురందేశ్వరి విజ్ఞప్తి చేసినట్టు వీటి పైన చంద్రబాబు విచారణకు ఆదేశిస్తే జగన్ ఇరకాటంలో పడొచ్చు అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తానికి జగన్ ను ఇరికించేందుకు కూటమి మూకుమ్మడిగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications