చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: రఘువీరా ఫైర్
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్నిఓ పక్క నవ్యాంధ్రను చేస్తానని చెబుతూ మరోవైపు నేరాంధ్రప్రదేశ్‌గా మార్చుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని భూ సేకరణ విషయంలో చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాప్తాడులో జరిగిన హత్యను చూస్తే ప్రభుత్వం ఈ హత్యలను దగ్గరుండి చేయిస్తున్నట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేతలకు గన్‌మెన్లను తొలగించిన ప్రభుత్వం రాజకీయ హత్యలకు లైసెన్స్ ఇస్తుందని ఆరోపించారు.

నిబద్ధతతో పనిచేసే పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, ప్రాణహాని ఉన్న మాజీ ఎమ్మెల్యేలకు గన్‌మెన్లను కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో చంద్రబాబుకు సీఎం స్థాయి భద్రత కల్పించామని ఆయన గుర్తు చేశారు.
హత్య తదనంతరం జరిగిన పరిణామాలను గమనిస్తే దీని వెనక తెలుగుదేశం పార్టీ భూ కబ్జాదారుల ప్రమేయం ఉండవచ్చుననే అనుమానం కలుగుతోందని రఘువీరా అన్నారు. హత్య జరిగిన కార్యాలయంలో రికార్డులను తగులబెట్టడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు.
రాప్తాడులో ఒక ఎకరం కోటి రూపాయల ధర పలుకుతున్న సమయంలో రికార్డులు తగులబెట్టి ఏదో మతలబు చేస్తున్నట్లు అర్ధమవుతోందని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications