సమీక్షలు తప్ప, సాయమేది: రఘువీరా, బొత్స
విశాఖపట్నం: హుధుద్ తుఫాను బాధితులను ఆదుకోవడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. బుధవారం రాత్రి విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుధుద్ తుఫాను వల్ల ఎలాంటి నష్టం జరగనుందో ముందుగానే వాతావరణ శాఖ, నాసా హెచ్చరించినప్పటికీ అందుకు తగిన విధంగా ప్రభుత్వం సన్నద్ధం కాలేదని ఆరోపించారు.
తుఫాను సంభవించి నాలుగు రోజులు గడచినా నేటికీ బాధితులకు కనీస సదుపాయాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తాము బాధిత ప్రాంతాలలో పర్యటించినపుడు అధికారులెవరూ తమ ప్రాంతానికి రాలేదని జనం మొరపెట్టుకున్నారని చెప్పారు. నేటికీ కనీసం మంచినీళ్లు, ఆహారం అందించలేకపోతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యుత్ పునరుద్ధరించే వరకు తాను ఇక్కడే బస చేస్తానని చెప్పారే తప్ప, ఎప్పటిలోగా విద్యుత్‌ను పునరుద్ధరిస్తారన్నది స్పష్టం చేయలేదని అన్నారు.

తుఫాను సమయంలో మృతి చెందిన వారి సంఖ్య ఎంత అన్నదీ నేటికి ప్రభుత్వం స్పష్టం చేయలేకపోతుందన్నారు. మొదటి రోజున ముగ్గురు అని, నేడు 29 మంది అని చెబుతున్నారే తప్ప, మృతుల పేర్లను బహిర్గతం చేయడం లేదన్నారు. కాగా, తుఫాను సమయంలో గాయపడిన, మృత్యువాతపడిన వారికి నష్టపరిహారం అందుతుందో లేదోనని బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షలు చేయడం తప్ప, సహాయ చర్యలు వేగవంతం కావడం లేదని పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తాము తుంగ్లాం గ్రామం పర్యటించగా అక్కడ 700 మందికి రెండు బోర్లు మాత్రమే ఉన్నాయన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ నగరంలో పర్యటించినపుడు కనీసం ఏ ఒక్క బాధితునితో మాట్లాడించకపోవడం శోచనీయమని న్నారు. ప్రధాని రూ.వెయ్యి కోట్లు సాయం అందించనున్నట్టు ప్రకటించారని, బాధితులతో మాట్లాడిస్తే మరింత ఎక్కువ సాయం అందే అవకాశం ఉండేదని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications