తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా వందేభారత్ రైళ్లు - రూట్లు ఇవే, తుది నిర్ణయం..!!
తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా వందేభారత్ రైళ్లు రానున్నాయి. ఇప్పటికే రెండు రైళ్లు కొనసాగుతున్న వేళ జూలైలో మరో రైలు ప్రారంభం కానుంది. ఏపీ, తెలంగాణ లో ఉన్న డిమాండ్ తో మరిన్ని మార్గాలతో కొత్తగా వందే భారత్ రైళ్ల ప్రతిపాదనల పైన రైల్వే బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 35 కొత్త వందేభారత్ రైళ్లను ప్రవేశ పెట్టేందుకు కార్యాచరణ సిద్దమైంది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి తొమ్మది రైళ్లకు సంబంధించి అధ్యయనం జరుగుతోంది.
అందుబాటులోకి వందేభారత్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తున్న రెండు వందేభారత్ రైళ్లకు అంచనాలకు మించి ఆదరణ కనిపిస్తోంది. ఇప్పుడు ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణీకుల కోసం మరిన్ని సర్వీసులు ప్రవేశ పెట్టేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇందులో డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో వందేభారత్ ప్రవేశ పెట్టటం ద్వారా ఆదరణ...ఆదాయం సమకూరుతుందని రైల్వే అధికారులు లెక్కలు వేస్తున్నారు. రాజకీయంగానూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కీలకంగా మారాయి. తాజాగా అవుటర్ రైల్ ప్రాజెక్టు ప్రకటించిన కేంద్రం.. ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్ల ప్రకటన దిశగా అడుగులు వేస్తోంది.
తెలుగు రాష్ట్రాల నుంచి కొత్గగా : దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ నుంచి పలు ప్రాంతాలకు రైళ్లల్లో రద్దీ కొసాగుతోంది. కొత్తగా ప్రతిపాదించిన వందేభారత్ రైళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి తొమ్మది మార్గాల్లో ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు అందాయి. అందులో..సికింద్రాబాద్ - నాగపూర్ సర్వీసుకు ఇప్పటికే ఆమోద ముద్ర లభించింది.
మరో రెండు రైళ్లు కాచిగూడ - బెంగళూరు, సికింద్రాబాద్ - పూణే సర్వీసులకు సంబంధింది తుది కసరత్తు జరుగుతోంది. భువనేశ్వర్ - విశాఖ మధ్య ట్రయిల్ రన్ పూర్తయింది.విశాఖపట్నం - షాలిమార్, బెంగళూరు - తిరుపతి, చెన్నై సెంట్రల్ - సికింద్రాబాద్, చెన్నై సెంట్రల్ - విజయవాడ రూట్లకు సంబంధించి తాజాగా ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు చేరాయి.

వచ్చే నెలలో ప్రారంభం : జూలై నెలలో సికింద్రాబాద్ - నాగపూర్ సర్వీసును ప్రధాని ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. ఆ తరువాత సికింద్రాబాద్ - పూణే, కాచిగూడ - బెంగళూరు వయా పుట్టపర్తి వందేభారత్ ప్రకటనకు వీలుగా కసరత్తు తుది దశకు చేరుకుంది. లాంగ్ జర్నీ రూట్లలో బెర్తులతో సిద్దం అవుతున్న వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రాగానే ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయించినట్లు చెబుతున్నారు.
దీంతో.. రానున్న మూడు నెలల కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి నాగపూర్ - సికింద్రాబాద్, విశాఖ - భువనేశ్వర్ మధ్య వందేభారత్ సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ముందుగా తెలంగాణ జిల్లాల మీదుగా నాగపూర్ చేరేలా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయిన కొత్త సర్వీసు ప్రారంభం పైన అధికారులు పోకస్ పెట్టారు.












Click it and Unblock the Notifications