జగన్‌ను సీఎం చేయడానికి నేనెవరిని- ఆర్జీవీ ఘాటు రిప్లై..!!
అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ దీన్ని నిర్మిస్తోన్నారు. ఇదివరకు వంగవీటి సినిమాను నిర్మించింది ఆయనే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపుదిద్దుకుంటోంది. వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్ పోషిస్తోన్నాడు. వైఎస్ భారతి క్యారెక్టర్‌లో మానస రాధాకృష్ణన్ నటిస్తోన్నారు. వ్యూహం సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్‌ను రామ్ గోపాల్ వర్మ.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ వచ్చారు.
ఈ సినిమా షూటింగ్.. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో శరవేగంగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో సినిమాను తెరకెక్కిస్తోంది చిత్రం యూనిట్. వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఇందులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల పాత్రలను తాజాగా రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశారు. వైఎస్ జగన్, భారతి, విజయమ్మ, షర్మిల పాత్రధారులు పాల్గొన్న సన్నివేశాలను షూట్ చేశారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కొన్ని సన్నివేశాలు రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో తాను చూసిన వాస్తవ పరిస్థితులు, నమ్మిన నిజాల ఆధారంగా సినిమాను తీస్తోన్నానని, అవే ఈ సినిమాలో ఉంటాయని తేల్చి చెప్పారు. ఈ సినిమా ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుందని వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి ఏం చేయబోతోన్నారంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు రామ్ గోపాల్ వర్మ.. స్పందించారు. జగన్‌ను సీఎం చేయడానికి నేనెవర్ని అంటూ వ్యాఖ్యానించారు. జగన్‌లోని రియాలిటీని, ఆయనపై తనకు ఉన్న అభిప్రాయాన్ని తెలియజేయడానికే సినిమా తీస్తోన్నానని అన్నారు.

బ్రో సినిమాలో అంబటి రాంబాబు స్పూఫ్‌పైనా ఆయన రియాక్ట్ అయ్యారు. మనిషనే ప్రతి ఒక్కడికీ నోరుంటుంది.. నోరున్న ప్రతి ఒక్కడికీ ఓ ఒపీనియన్ ఉంటుందని పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని కూడా ఈ సినిమాలో చూపిస్తోన్నామని రామ్ గోపాల్ వర్మ అన్నారు.
వాల్తేర్ వీరయ్య 200 రోజుల షీల్డ్ ప్రజెంటేషన్ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడటానికి ఆర్జీవీ ఆసక్తి చూపలేదు. ఆయన ఏ సందర్భంలో ఆ కామెంట్స్ చేశాడో తనకు తెలియదని, చిరంజీవి సినిమా కాబట్టే టికెట్ల రేట్లను పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని అనుకోవట్లేదని అన్నారు.
టాలీవుడ్‌ను ప్రోత్సహించడానికి జగన్ తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని కితాబిచ్చారు. టీడీపీ నాయకులు మనుషుల బట్టలు విప్పుతామంటూ ఎప్పుడూ చెబుతుంటారని, తాను వ్యూహం సినిమాలో.. నిజాన్ని బట్టలు లేకుండా చూపించబోతోన్నానని ఆర్జీవీ పేర్కొన్నారు.
వ్యూహం సినిమాను వైఎస్ఆర్సీపీ నిర్మిస్తోందంటూ వచ్చిన వార్తలను ఆర్జీవీ తోసిపుచ్చారు. తన సినిమాకు నిర్మాత దాసరి కిరణ్ కుమారేనని, ఆయన ఒక్కరే తన వెనుక ఉన్నారని తేల్చి చెప్పారు. ఈ సినిమా ద్వారా ఎవ్వర్నీ టార్గెట్ చేయట్లేదని, ప్రేక్షకులకు ఓ మంచి సినిమాను అందించాలనేదే తన లక్ష్యమని అన్నారు.












Click it and Unblock the Notifications