‘బాబుకు ఆ పిచ్చి పట్టింది: పవన్‌తో కలిసి పనిచేస్తాం’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబునాయుడుకి భూమి పిచ్చిపట్టిందని, 13 జిల్లాలలో ఆయన భూములను తీసుకొంటున్నారని దుయ్యబట్టారు.
ఢిల్లీలోని సిపిఐ కేంద్ర కార్యాలయంలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆదివారం ఏపీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల భూమిని సేకరించి పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఏపీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో సహా కలిసి వచ్చే ఇతర పార్టీలతో కూడా పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా రామకృష్ణ స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయనకు తగిన బుద్ధి చెబుతామన్నారు.
ఆక్వాపార్క్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని జనావాసాలు లేని ప్రాంతంలో పార్క్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. బిజెపి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా విషయంలో బిజెపి నేతలు రాజీనామా చేసి గెలవాలని సవాలు విసిరారు.












Click it and Unblock the Notifications