రాయదుర్గంలో ఏం జరుగుతోంది?
Rayadurgam: సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన మరో మలుపు తీసుకుంది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ తన విచారణను మరింత వేగవంతం చేసింది. దీని వెనుక గల అసలు నిందితుల గురించి కూపీ లాగుతోంది. వారిని తెర మీదికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది.
ఈ ఏడాది మార్చి 1వ తేదీన బెంగళూరులోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద ఎత్తున మారణహోమాన్ని సృష్టించాలనే ఉద్దేశంతోనే నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఉగ్రవాద కోణ కావడంతో ఈ ఘటనపై విచారణను తన చేతుల్లోకి తీసుకుంది ఎన్ఐఏ.

ఈ కేసులో ప్రధాన నిందితులు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ చోటు చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా తమ గాలింపు చర్యలను విస్తృతం చేశారు.
ప్రధాన నిందితుల విచారణ సందర్భంగా వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. రామేశ్వరం కేఫ్ పేలుడుతో సంబంధం ఉన్న వారికోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా- ఈ తెల్లవారు జామున అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో సోదాలను నిర్వహించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక నిందితుడు రాయదుర్గంలో నివసిస్తోన్నట్లు పక్కా సమాచారం అందిన నేపథ్యంలో తనిఖీలను చేపట్టారు. అనుమానితుడి కోసం అన్ని ఏరియాలనూ గాలించారు. అనంతరం అతణ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో బెంగళూరు, తమిళనాడులోని కోయంబత్తూరు సహా 11 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు దిగారు ఎన్ఐఏ అధికారులు. కోయంబత్తూరులో ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు. కోయంబత్తూరు పెరియసుబ్బన్న గౌండర్ వీధిలో నివసిస్తోన్న నహీం, సాయిబాబా కాలనీ నారాయణగురు వీధిలో ఉండే జాఫర్ ఇక్బాల్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications