టీటీడీ అన్ని విభాగాల ఉద్యోగులతో ఈఓ సమావేశం: శ్రీవారి భక్తులకు..
Tirumala: ఈ నెల వవ తేదీన రథ సప్తమి. ఈ పర్వదినం కోసం తిరుమలలో ముస్తాబైంది. ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. సూర్యజయంతి నాడు శ్రీవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దఫా రెండు నుంచి మూడు లక్షల మంది వరకు భక్తులు తిరుమలకు వస్తారని అధికారులు అంచనా వేస్తోన్నారు.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులతో సమావేశం అయ్యారు. పలు సూచనలు చేశారు. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో, ఇంఛార్జి సివిఎస్వో, తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. రథసప్తమి రోజున గ్యాలరీలలో భక్తులకు అందించే సేవలపై ముందస్తుగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసుకుని సమిష్టిగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రతి గ్యాలరీకి ఇన్‌ఛార్జ్‌తో పాటు, అన్ని శాఖల విభాగాల అధికారులకు బాధ్యతలను అప్పగించామని చెప్పారు
పోలీసులు, విజిలెన్స్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతి ఉద్యోగి కూడా సంబంధిత విభాగాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నదానం, పోలీసు, విజిలెన్స్, ఇంజినీరింగ్, వైద్య, ఆరోగ్య, శానిటేషన్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది ఉమ్మడి కార్యాచరణతో సేవలు అందించాలని సూచించారు.
ఉన్నత ప్రమాణాలతో శానిటేషన్ సేవలు అందించాలని సూచించారు. అత్యవసర విభాగాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా పనిచేయాలని కోరారు. చేయాల్సిన, చేయకూడని పనుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా భక్తులకు సేవలు అందించాలని కోరారు.
చక్రస్నానం రోజున ఉద్యోగులు తమకు అప్పగించిన ప్రాంతాల్లో విధులను నిర్వర్తించాలని కోరారు. నాలుగు మాడ వీధుల్లో దాదాపు 200 గ్యాలరీలు, 66 అన్నదాన కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా రథసప్తమికి 3,500 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తారని ఈవో తెలిపారు.
అదనపు ఈవో మాట్లాడుతూ.. స్కిల్డ్, అన్ స్కిల్డ్ సిబ్బందిని నియమించకుని మరింత అప్రమత్తంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేసినప్పుడే ఎలాంటి కార్యక్రమాలు అయినా విజయవంతం అవుతాయని పేర్కొన్నారు. గ్యాలరీలలో నియమితులైన అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా తాము అందిస్తున్న విధులు, బాధ్యతలను భక్తులకు తెలియజేస్తే ఎలాంటి సమస్యలు రావని అన్నారు.
ఏదైనా సమస్యలు వస్తే తక్షణం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందించిన స్ఫూర్తితోనే సేవలు అందించాలని కోరారు. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు, పోలీసు, విజిలెన్స్ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు.












Click it and Unblock the Notifications