చంద్రబాబుపై లోకేశ్ ఆవేదన: త్యాగమా లేక హైదరాబాద్‌లో వ్యాపారం కోసమేనా?
హైదరాబాద్: బుధవారం విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రారంభించడానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడుతూ తన తండ్రి చంద్రబాబునాయుడు, హైదరాబాదుకు వచ్చిన సందర్భంలో తన కొడుకు(దేవాంశ్)ను ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తే వాడు ఆయన దగ్గరకు వెళ్లకుండా బేర్ మంటున్నాడంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబమంతా హైదరాబాద్‌లో ఉంటే తాతయ్య ఒక్కడే అమరావతిలో ఉండటంతో మనవడితో అనుబంధం ఏర్పడుకుండా పోతుందని లోకేశ్ ఆవేదన చెందాడు. ఈ సభలో ఉన్న తాత, అవ్వలందరూ దీన్ని గురించి ఆలోచించాలని అన్నారు. ఇలా లోకేశ్ చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు చాలా త్యాగం చేస్తున్నారని లోకేశ్ ఉద్దేశం కావొచ్చు.

అంతేకాదు రాష్ట్రం కోసం కుటుంబాన్ని వదలి పనిచేస్తున్నారని, ఆయనంతటి త్యాగపురుషుడు మరొకరు లేరని చెప్పడం లోకేశ్ ఉద్దేశం. నిజానికి చంద్రబాబు నాయుడు ఏపీని హైదరాబాద్ నుంచి పదేళ్ల పాటు పరిపాలించొచ్చు. అలా తోసిరాజని, అమరావతికి వలస వెళ్లిపోయారు.
ఉండవల్లి సమీపంలోని లింగమనేని గెస్ట్‌హౌస్‌లో ఉంటూ 'మన రాష్ట్రం నుంచే మన పాలన' అనే నినాదాన్ని పాటిస్తున్నారు. ఆయన కుటుంబం మాత్రం ఆయన వెంట వెళ్లలేదు. ఆయన కుటుంబం ఇంకా హైదరాబాదులో ఎందుకు ఉంటున్నట్లు? వారు అమరావతికి వెళ్లడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి?
అందరూ అక్కడకు వెళ్లితే ఎంచక్కా తాతా మనవడూ మధ్య అనుబంధం ఏర్పడుతుంది కదా అని ప్రశ్నించే వారు లేకపోలేదు. అయితే చంద్రబాబు కుటుంబాన్ని కావాలనే అమరావతికి రాకుండా ఎవరైనా అడ్డుకున్నారా? లేక వారే కావాలని అక్కడికి వెళ్లడం లేదా? అనే సందేహాలు ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నాయి.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి నుంచి పరిపాలన కొనసాగిస్తున్నాడు గానీ, ఆయన కుటుంబం మొత్తం వ్యాపారాలు చూసుకోవడం కోసం హైదరాబాదులో ఉంటున్నారనే వారు లేకపోలేదు. కేవలం వ్యాపారాల కోసమే చంద్రబాబు కుటుంబం హైదరాబాద్‌లో ఉంటున్నారని వాటి కోసమే హైదరాబాదును వదిలిపెట్టడం లేదని అంటున్నారు.
దీనిని నారా లోకేశ్ చంద్రబాబు త్యాగంగా చెప్పుకుంటున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలను చూసిన ఆనందంలో లోకేష్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడనే వారు కూడా ఉన్నారు. బహిరంగ సభల్లో ఏదో చెప్పబోయి, మరేదో చెప్పేసి లభ్ది పొందాలని చూస్తున్నారని అంటున్నారు.
చంద్రబాబు తన మనవడికి దూరంగా ఉండటాన్ని టీడీపీ నేతలు మాత్రం ఆయన్ని కొనియాడుతున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి గురువారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన సభలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పాలనలో నిమగ్నమైన చంద్రబాబు తన మనవడితో కూడా సరదాగా గడపలేకపోతున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేసుకుపోతున్న చంద్రబాబు కర్మయోగిలా మారారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు ముందు చంద్రబాబు వైపు తిరిగిన జేసీ ''నా మనసులోని మాట చెబుతున్నా. దానిని మీరు పొగడ్త అనుకుంటే నేనేమీ చేయలేను'' అంటూ వ్యాఖ్యానించారు.
భార్య, కొడుకు, కూతురు కంటే... మనవడు, మనవరాలితో గడిపే క్షణాలు ఏ వ్యక్తి జీవితంలోనైనా ప్రత్యేకమైనవేనని జేసీ చెప్పారు. ఆ అనుభూతిని చంద్రబాబు పొందలేకపోతున్నారని ఆయన అన్నారు. ఇందుకు చంద్రబాబు కర్మయోగిగా మారడమే కారణమని కూడా ఆయన పేర్కొన్నారు.
అసలు మీ మనవడితో ఎంతసేపు ఆడుకున్నారో చెప్పాలంటూ ఆయన చంద్రబాబును నిలదీశారు. జేసీ ప్రశ్నలకు స్పందించడానికి కాస్తంత ఇబ్బంది పడ్డ చంద్రబాబు మాట్లాడకుండా గంభీర వదనంతోనే అలా కూర్చుండిపోయారు.












Click it and Unblock the Notifications